mt_logo

తెలంగాణ రైతులను ముంచడానికే చంద్రబాబు కుట్రలు – హరీష్ రావు

తెలంగాణ, ఆంద్ర ఒక్కటేనని, తెలుగు ప్రజలందరినీ మళ్ళీ కలుపుతానని, సమన్యాయం అని ప్రగల్భాలు పలికిన ఆంధ్రాబాబు చంద్రబాబు ఇప్పుడు పర్చేజ్ అగ్రిమెంట్ ను రద్దు చేస్తూ తెలంగాణ రైతులను ముంచడానికి చేస్తున్న ప్రయత్నాలపై భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు చీకట్లో మగ్గాలని ఆంధ్రా సీఎం చంద్రబాబు తెలంగాణకు కరెంటు రాకుండా పీపీఏ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని, ఆంధ్రా, తెలంగాణ రెండూ సమానమని చెప్పిన బాబు ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇబ్బంది పాలు చేయడానికి, వ్యవసాయానికి విద్యుత్ అందకుండా చేయడానికి కుట్రలు పన్నారని అన్నారు.

మెదక్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రి హరీష్ రావుకు ప్రజలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. స్థానిక ఆర్అండ్ బీ అతిథి గృహంలో ఆయన స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి తో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో విద్యుత్ ఒప్పందాలపై కేంద్రం చట్టం చేసిందని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఆంధ్రా సర్కార్ నిరయం తీసుకోవడం ఏమిటని, తెలంగాణ ప్రజల సంక్షేమం ముఖ్యమా? బాబు భజన ముఖ్యమా? అని తెలంగాణ టీడీపీ నేతలను ప్రశ్నించారు.

వచ్చే పదేళ్ళపాటు సీమాంధ్రకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుందని ఇక్కడి శాసనసభ, డీజీపీ కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలకు, సీమాంధ్ర ఉద్యోగులు, మంత్రుల కార్యాలయాలకు మంచినీళ్ళు, కరెంటు అవసరం లేదా?అని, చర్యకు ప్రతిచర్య అవసరం లేదని, అయినా ఆంధ్రా సర్కార్ మొండికేస్తే తప్పదేమోనని హరీష్ రావు హెచ్చరించారు. ఇప్పటికే పోలవరం ఆర్డినెన్స్ ద్వారా ఏడు గ్రామాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం వల్ల 450మెగావాట్ల విద్యుత్ కోల్పోతున్నామని, పీపీఏ రద్దుతో మరో 450మెగావాట్ల విద్యుత్ కూడా కోల్పోవాల్సి వస్తుందని, తెలంగాణలో ఏర్పడే విద్యుత్ కోతలకు చంద్రబాబే కారణం అవుతారని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు విద్యుత్ ఇచ్చేందుకు కృషి చేస్తుందని, ఇతర రాష్ట్రాలనుండి విద్యుత్ కొనుగోలు చేసి అయినా రైతులను ఆదుకుంటామని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారని హరీష్ రావు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *