అక్రమ భూకబ్జాలపై తెలంగాణ రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న చర్యలను చూసి సీమాంధ్ర నేతలు హైదరాబాద్ నగరంలో తెలంగాణ ప్రభుత్వం అనేదే లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కుట్రల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో భాగంగా గవర్నర్ అధికారాలు పెంచాలని, కీలకమైన రెవెన్యూ భూపరిపాలన గవర్నర్ చేతికి అప్పగించాలంటూ కేంద్రానికి లేఖ వ్రాశారు. శాంతిభద్రతలు పూర్తిగా గవర్నర్ అధీనంలో ఉండాలని, నగరంలోని ఇద్దరు కమిషనర్లు, డీఎస్పీలు, సీఐలు కూడా గవర్నర్ ఆధీనంలోనే ఉండాలని పేర్కొన్నారు.
చంద్రబాబు డిమాండ్ కు తలొగ్గిన కేంద్రప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ కు అధికారాలు కట్టబెట్టే 12 అంశాలతో కూడిన సర్క్యులర్ ను తెలంగాణ ప్రభుత్వానికి పంపింది. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా మార్చాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు విఘాతం కల్పించేలా, రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ ధీటైన సమాధానం పంపడానికి సిద్ధమయ్యారు. ఆదివారం టీఆర్ఎస్ పార్టీ ఎంపీలతో సమావేశమై ఈ అంశానికి సంబంధించి పార్లమెంటులో దేశమంతా ప్రతిధ్వనించేలా గట్టిగా పోరాడాలని సూచించారు.
కేంద్రం పంపిన సర్క్యులర్ ను కనుక అమలుచేస్తే తెలంగాణ రాజధానిలో అసలు తెలంగాణ సర్కారే ఉండదు. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లాలు గవర్నర్ అధీనంలోకి వెళ్తాయి. రాజధానిపై తెలంగాణ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు కూడా గవర్నర్ రద్దు చేయవచ్చని కూడా ఇందులో పొందుపరచారు. ఈ మూడు జిల్లాల పోలీస్ వ్యవస్థను గవర్నర్ కు అప్పగిస్తే తమ పరిస్థితి ఏమిటని తెలంగాణ పోలీసుల ఆందోళన. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ అధికారులను మార్చి సీమాంధ్రకు అనుగుణంగా వ్యవహరిస్తున్న ఈశాన్య రాష్ట్రాల ఐపీఎస్ లను నియమించేందుకు గవర్నర్ పాలన అనే కుట్ర చేస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.