ఉద్యోగుల విభజనపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రొఫెసర్ కోదండరాం వ్యతిరేకిస్తూ, రాష్ట్రపతి ఉత్తర్వులపై బాబుకు అవగాహనలేకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యోగులను ఇష్టం వచ్చినట్లు విభజిస్తే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో అక్రమంగా పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులు వెళ్లిపోవాల్సిందేనని, జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్రస్థాయి ఉద్యోగులకు న్యాయం జరగాలని సూచించారు.
మరోవైపు కరీంనగర్ లో తెలంగాణ ఎన్జీవో అధ్యక్షుడు దేవీప్రసాద్ మాట్లాడుతూ వివిధ శాఖాధిపతుల జాబితాను వెంటనే ప్రకటించాలని, వారి వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాలని, రెవెన్యూ శాఖలో రద్దుచేసిన పోస్టులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. స్థానికత విషయంలో తప్పుడు ధృవీకరణ పత్రాలు సమర్పించిన ఉద్యోగులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని దేవీప్రసాద్ కోరారు.