mt_logo

చంద్రబాబు చెప్పేవి నీతులు.. తీసేవి గోతులు – హరీష్ రావు

పోలవరం ముంపుకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపే ఆర్డినెన్స్ కేంద్రప్రభుత్వం జారీ చేయడం వెనుక చంద్రబాబు, వెంకయ్యనాయుళ్ళ కుట్ర దాగి ఉందని, తెలంగాణపై ఇంకా వాళ్ళిద్దరూ విషం చిమ్ముతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. బుధవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మరికొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలోనే ఉంటామని గిరిజనులు స్థానిక ఎన్నికలను బహిష్కరించి నిరసనలు తెలిపారని, గిరిజనుల జీవితాలపై దెబ్బకొట్టి పోలవరం నిర్మించాలని చూస్తున్న చంద్రబాబు ప్రయత్నాలు అమానుషమని పేర్కొన్నారు.

‘తెలంగాణలోనే ఉంటానంటున్నావు. ఉండి ఏం చేస్తున్నావు? గోతులు తీస్తున్నావా?’ అని హరీష్ రావు చంద్రబాబును ప్రశ్నించారు. తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే తెలంగాణ టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదు? ఆంధ్రోళ్లు పెట్టిన అన్నం తిని వారి ఉపన్యాసాలు విని నిద్రపోతున్నారా? మన గడ్డ మీద కూర్చొని మనల్నే ముంచుతుంటే మీకు చీమకుట్టినట్లుగా కూడా ఎందుకు లేదు? అని నిలదీశారు. పోలవరంపై కేంద్రం చేసిన ఆర్డినెన్స్ తెలంగాణకు మరణశాసనమని, 205 గ్రామాలను ఆంధ్రలో కలిపి ఆదివాసీలను ముంచడానికి నాయుడు ద్వయం కుట్రలు చేస్తుందని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ విషయంపై తెలంగాణ బీజేపీ నేతలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని, కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మీరు సమర్ధిస్తున్నారా? మీరు తెలంగాణ ప్రజలవైపా? లేక టీడీపీ వైపా? అని తెలంగాణ బీజేపీ నేతలను హరీష్ రావు ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, డిజైన్ మార్చాలని మాత్రమే కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు. కేంద్రం ఇదే రకంగా ముందుకు పోతే ప్రజాపోరాటాలు, న్యాయ పోరాటాలు ప్రభుత్వపరంగా చేస్తూనే ఉంటామని తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజయ్య, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *