పోలవరం ముంపు ప్రాంతాలైన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ ఎన్డీయే ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడం పట్ల యావత్ తెలంగాణ ప్రపంచం భగ్గుమంది. దీనంతటికీ కారణం సీమాంధ్ర నేతలైన చంద్రబాబు, వెంకయ్యనాయుడే అని, తెలంగాణకు అన్యాయం జరిగేలా మొదటినుండీ వారు వ్యవహరిస్తున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
చంద్రబాబు అన్ని రాష్ట్రాలూ తిరిగి జాతీయ నాయకులందరినీ కలిసి ఎలాగైనా తెలంగాణ అడ్డుకోవాలని కుట్రలు చేశాడు. ప్రత్యేక తెలంగాణ అడ్డుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డినా వారి ప్రయత్నాలు ఫలించకపోగా బెడిసికొట్టాయి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడంతో తట్టుకోలేని వారు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వ అండతో తెలంగాణకు అన్నివిధాలుగా నష్టం కలిగించే విధంగా పావులుకదుపుతున్నారు.
కేంద్రప్రభుత్వం ఆదరాబాదరా ఆర్డినెన్స్ తేవడం పట్ల టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ గురువారం తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు. దీనితో ఉద్యమపార్టీ టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా మారినా మరోసారి తెలంగాణ ప్రజల బాధ్యతను తన నెత్తిపై వేసుకుంది. గతంలో కూడా ఎన్నోసార్లు పోలవరం విషయమై కేసీఆర్ పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయమై కేసీఆర్ గవర్నర్ ను కలిసి బుధవారం పోలవరానికి సంబంధించి ఒక నివేదికను సమర్పించారు.
పోలవరం ప్రాజెక్టుపై మొదటినుండీ టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి, తెలంగాణ జేఏసీ, ఉద్యోగసంఘాలు, ప్రజా సంఘాలు తమ నిరసనను తెలుపుతూనే ఉన్నాయి. ప్రాజెక్టుకు తాము వ్యతిరేకం కాదని, డిజైను మార్చమని డిమాండ్ చేసినా అప్పటి వైఎస్ ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడంతో కేంద్రంలో ఉన్న ఒక క్యాబినెట్, ఒక సహాయ మంత్రి, రాష్ట్రంలో ఆరు మంత్రి పదవులకు రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమబాట పట్టింది. సుప్రీంకోర్టు లో కూడా న్యాయపోరాటం సాగించింది.
అదేవిధంగా ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా అప్పట్లో ఇదే విషయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా 2007-2008లో పోలవరం ప్రాజెక్టుపై స్టే ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరోపక్క ఛత్తీస్ గడ్, ఒడిశా రాష్ట్రాలు పోలవరం ప్రాజెక్టు వల్ల తమ రాష్ట్రాల్లో కూడా సమస్యలు వస్తాయని సుప్రీంకోర్టును ఆశ్రయించగా పోలవరంపై చాలాకాలంగా స్టే కొనసాగుతూ వస్తుంది.