చలో అసెంబ్లీ సక్సెస్
నలువైపులా నిర్బంధం
పోరాటమే నినాదం
ముళ్లకంచెలు, బారికేడ్లు దాటుకొని
చేరుకున్న పోరుబిడ్డలు
ఓయూలోకి చొచ్చుకెళ్లి విద్యార్థులను
చితక బాదిన పోలీసులు
బాష్పవాయువుతో పొగచూరిన
ఉస్మానియా వర్సిటీ
ఆరు గంటలకే సీఎం అసెంబ్లీకి..
వెనుక గేటు నుంచి ఇంటికి
టీ జేఏసీ చైర్మన్, తెలంగాణ ఎంపీలు,
టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సహా వేలాది
మంది తెలంగాణవాదుల అరెస్టు
చలో అసెంబ్లీ విజయవంతం : కోదండరామ్
నేడు తెలంగాణ బంద్ : కేసీఆర్
హైదరాబాద్, జూన్ 14 (జనంసాక్షి) :
తెలంగాణ రణగర్జనతో హైదరాబాద్ హోరెత్తింది. టీ జేఏసీ పిలుపునకు స్పందించిన తెలంగాణవాదులు స్వచ్ఛందంగా తరలివచ్చి అసెంబ్లీ ఎదుట నిరసనకు ప్రయత్నించారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఉస్మానియా విద్యార్థులు విజయవంతం చేశారు. అసెంబ్లీకు రెండు కిలోమీటర్ల చుట్టూ మూడంచెల కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినప్పటికి, వేలాది మంది పోలీసు బలగాలను ఏర్పాటు చేసినప్పటికి ఉస్మానియా విద్యార్థులు చేదించుకుని అసెంబ్లీని ముట్టడిరచారు. చేతుల్లో టీఆర్‌ఎస్ జెండాలు చేత బూని వాటిని అసెంబ్లీ ప్రహరీ గోడలకు కట్టారు. ఈ తరుణంలో పోలీసులు వారి పై లాఠీచార్జి చేశారు. సుమారు ఇరవై మంది విద్యార్థులు రెండు విడతలుగా అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు విద్యార్థులను అరెస్ట్ చేశారు. దీంతో విద్యార్థులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. తెలంగాణ కోసమే మేం వచ్చాం తప్ప అసెంబ్లీని కూల్చివేయం, కాల్చివేయం అంటూ వాదించారు. అరెస్ట్ చేసుకుంటే చేసుకోండి కాని తమ వాణిని వినిపించే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తూ వాహనాల్లోకి పంపిస్తూ కాళ్లతో తన్నడంతో విద్యార్థులు, మీడియా నిలదీశారు. దీంతో వెనక్కితగ్గిన పోలీసులు జాగ్రత్తగా వాహనాల్లోకి తీసుకెళ్లి స్టేషన్లకు తరలించారు. విద్యార్థి ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. సీమాంధ్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి, సీమాంధ్ర ప్రభుత్వానికి తము చేరుకోవడంతోనే లక్ష్యం పూర్తయిందన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణాకు చెందిన మంత్రులను, ఎమ్మెల్యేలను గ్రామాల్లోకి రానివ్వమని విద్యార్థులు హెచ్చరించారు.
టీఆర్‌ఎస్‌ఎల్పీ భవనంపైకెక్కిన ఎమ్మెల్యేలు
పోలీసులు అరెస్టు తెలంగాణవాదులను విడుదల చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కావేటి సమ్మయ్య, ధాస్యం వినయభాస్కర్ అసెంబ్లీ ఆవరణలోని పార్టీ శాసనసభ పక్ష కార్యాలయంపైకి ఎక్కి నిరసన తెలిపారు. నల్లజండా, గులాబీజండాలను ఎగురవేశారు. తెలంగాణలో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన ఉద్యమకారులందరిని విడిచి పెట్టాలని లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని, అప్పటివరకు భవనం కిందకు దిగమని హెచ్చరించారు. పోలీసులుగాని అసెంబ్లీ అధికారులు గాని పైకి రావాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఇదిలావుంటే మిగతా ఎమ్మెల్యేలు నంబర్ వన్ గేట్‌వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈక్రమంలో సీమాంధ్ర దిష్టిబొమ్మ దహనం చేశారు. ముఖ్యమంత్రి బయటకు వెళ్లకుండా గేటుకు అడ్డుగా పడుకున్నారు. దీంతో సీఎం కార్యాలయానికే పరిమితం అయ్యారు. గేట్‌పైకి ఎక్కినిరసన తెలిపేందుకు హరీశ్‌రావు ప్రయత్నించారు. పోలీసులు ఎమ్మెల్యేలకు మధ్య తోపులాట జరిగింది. అంతకు ముందు స్పీకర్ నాదేండ్ల మనోహర్‌ను భారీ భద్రత మధ్య బయటకు పంపించారు. ఇదిలావుంటే గేట్ నంబర్ 2 వద్ద కొందరు టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలు ధర్నాకు దిగారు. తమను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిస్తున్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ ఇస్తామని చెప్పి మాట తప్పినందునే గుర్తుచేయడానికే ఆందోళనకు దిగామని దీనిని అడ్డుకోవడం చూస్తే తప్పించుకుని పారిపోవాలని చూస్తుందని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆరోపించారు. ప్రజల నోల్లు మూయలేరని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. పోలీసులు కేవలం మనుషులను మాత్రమే అరెస్ట్ చేయగలరని, తెలంగాణ ప్రజలు కాంగ్రెస్, టిడిపి నేతలను శాశ్వతంగా సమాధి చేస్తారని హెచ్చరించారు. ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిఘటించారు. చేయి పడితే విరగ్గొడతామని హెచ్చరించారు. పోలీసులకు ఎమ్మెల్యేలకు మధ్యతోపులాట సాగింది.
ఎమ్మెల్యేలు, మీడియాపై పోలీసుల అనుచిత ప్రవర్తన
చలో అసెంబ్లీ కార్యక్రమంలో పాల్గొన్న వారిపై పోలీసుల దమనకాండను నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టిఆర్‌ఎస్, బిజెపి, సిపిఐ ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్‌చేసి గోల్కొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమానుషంగా వ్యవహరించడమేకాక, బలవంతంగా లాక్కెల్లి వ్యాన్లలోకి పంపించడం దౌర్బాగ్యమన్నారు హరీష్‌రావు. అరెస్ట్ చేసిన అనంతరం ఎమ్మెల్యేలను గోల్కొండ పోలీస్ స్టేషన్‌లో నిర్బందించారు. అయితే అక్కడ కూడా ఎమ్మెల్యేలు తమ నిరసనను వ్యక్తంచేశారు. హరీష్‌రావు ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించగా వారిపై దురుసుగా వ్యవహరించారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన మీడియాపై పోలీసులు నిరంకుశంగా వ్యవహరించడమేకాక పోలీస్‌స్టేషన్ ఆవరణనుంచి బయటకు పంపిచారు. దీంతో ఎమ్మెల్యేలు తమ నిరసననను కొనసాగించారు. మాక్ అసెంబ్లీని అడ్డుకున్నంత మాత్రాన పోలీసులు పైచేయి సాధించామనుకుంటే అది మూర్కత్వమే అవుతుందని, తెలంగాణాగడ్డపైన తమకు రక్షణ లేదా, ప్రజాప్రతినిధులకు రక్షణ కల్పించకుండా దుర్మార్గంగా వ్యవహరించడాన్ని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తామేం అప్రజాస్వామిక చర్యలకు పాల్పడడం లేదని, మాక్ అసెంబ్లీ నిర్వహిస్తుంటే అడ్డుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. మీడియాపై కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు .
సీఎం కిరణ్, స్పీకర్‌కు చలో అసెంబ్లీ సెగ
చలో అసెంబ్లీ సెగ ముఖ్యమంత్రి, స్పీకర్‌కు, మంత్రులకు బాగానే తాకింది. చలో అసెంబ్లీ పిలుపుతో సిఎం కిరణ్, స్పీకర్ మనోహర్ ముందుగానే అసెంబ్లీకి చేరుకున్నారు. స్పీకర్ లోపలికి వెళ్లకుండా టిఆర్‌ఎస్, బిజెపి ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమం నేపథ్యంలో సిఎం తీరుపై విమర్శలు వెల్లువెత్తడమే కాకుండా స్వయంగా ఆయన ఇబ్బంది పడ్డారు. ఇంతకఠినంగా ఉండకుండా ఉంటే మంచిదని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానించారు. సమావేశాల కోసం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సభాపతి నాదెండ్ల మనోహర్ ఉదయాన్నే అసెంబ్లీకి వచ్చారు. సమావేశాలకు చాలా ముందే వారు అసెంబ్లీకి చేరుకున్నారు. దీంతో వారు తెలంగాణవాదులకు భయపడే ముందుగా వచ్చారని ఎద్దేవా చేస్తున్నారు. మధ్యాహ్నం అసెంబ్లీ సోమవారానికి వాయిదా పడిన అనంతరం కూడా కిరణ్ తన కాన్వాయ్‌లో కాకుండా ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వాహనంలో సచివాలయానికి వెళ్లారు. అంతకుముందు ఉదయాన్నే కిరణ్ అసెంబ్లీకి వచ్చినప్పటికీ తెలంగాణవాదులు ఆయన కాన్వాయ్‌కు అడ్డుపడ్డారు. దీంతో వెళ్లేటప్పుడు కాన్వాయ్‌ని అడ్డుకుంటారని భావించి ఆయన డిసిఎం కారులో సచివాలయానికి వెళ్లారు.
శంకర రావు కూడా కిరణ్ తీరుపై నిప్పులు చెరిగారు. చలో అసెంబ్లీ నేపథ్యంలో అరెస్టు చేసిన పలువురు ఆందోళనకారులను పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. వారిని వెయ్యి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఉదయం నుంచి దశల వారిగా ఆందోళనకారులు అసెంబ్లీ వైపుకు చొచ్చుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం తెలంగాణ లాయర్ల ఐకాస అసెంబ్లీ వైపుకు వచ్చే ప్రయత్నాలు చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అశోక్ నగర్‌లో తెలంగాణ జర్నలిస్టులను అరెస్టు చేశారు. చలో అసెంబ్లీలో పాల్గొన్న ఇంద్రసేనా రెడ్డికి గాయాలయ్యాయి. ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నైతిక విజయం సాధించిన తెలంగాణ ప్రజలు : కోదండరామ్
ప్రజల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్ర సాధనకోసం టిజెఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం అయిందని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన అనంతర మీడియాతో మాట్లాడుతూ సీమాంద్ర సర్కార్ నిర్బంధాలను వదిలించుకుని కుట్రలను భగ్నం చేశారన్నారు. ఆర్టీసీ క్రాస ్‌రోడ్ నుంచి ఇందిరాపార్క్ వద్దకు వెళ్తుండగా అశోక్‌నగర్ చౌరస్తా వద్ద కోదండరామ్‌తో పాటు, శ్రీనివాగౌడ్ వందలాది మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారుల మధ్య వాగ్వాదంతో తోపులాటలు కొనసాగాయి. కోదండరామ్‌పైకి డిసిపి రాంచందర్‌రావు అమానుషంగా ప్రవర్తించాడు. లాఠీని ప్రయోగించారు. దీంతో కోదండరామ్ కళ్లద్దాలు పగిలిపోయాయి. పెద్దమనిషి అని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ తీసుకెల్లి వ్యాన్లలోకి తోసేశారు. ఈ ఘటనను ఆయన వెంట ఉన్న తెలంగాణవాదులు తీవ్రంగా ప్రతిఘటించారు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా, వేలాది మంది పోలీసులను రంగంలోకి దింపినా కూడా ప్రజలు పట్టించుకోకుండా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కోదండరామ్ పేర్కొన్నారు. బైండోవర్లు, అరెస్ట్‌లు కొనసాగుతున్నప్పటికి చేదించుకుని హైదరాబాద్ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఇది అంతంకాదని, ఆరంభం మాత్రమేనన్నారు. సిఎం దొంగచాటుగా అసెంబ్లీ పోయినప్పుడే చలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతం అయిందన్నారు. రేపటి నుంచి మరింత పటిష్టంగా ఉద్యమాన్ని పదునుపెడతామని, కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. పోలీసులచేత అణిచివేయాలని చూసినప్పుడే ప్రభుత్వం తన చేతకాని తనాన్ని నిరూపించుకుందన్నారు. ఇంకా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు. సర్కార్ నైతికంగా విఫలం అయిందన్నారు.
కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోక తప్పదు
విజయం సాధించామనే అభిప్రాయంతోనే అందరం ఉన్నాం.. నిర్బంధాల మధ్యకూడా హైదరాబాద్‌కు రావడమేకాక, ఇందిరాపార్క్‌కు వచ్చారు. అసెంబ్లీకి రావాల్సిన ఎమ్మెల్యేలు రానేలేదు. కేవలం నిరసన తెలిపేవారే హాజరయ్యారు. విపరీతంగా కొట్టించిన తర్వాత ప్రభుత్వ ప్రతిష్టలను మంటగలుపుకుంది. పార్టీ గౌరవ మర్యాదలను పోగొట్టుకుంది. పెట్టగలగాలనుకున్న ఒత్తిడి తేగలిగాం. ముందుకు పోయేందుకు ఎరవుగా పనిచేస్తుంది. కావాలనే వాగ్వాదానికి అవకాశం ఉంటుంది. విూడియాతో మాట్లాడుతూనే ఉన్నా కూడా టియర్‌గ్యాస్ పెట్టారు. ఒకరుకాల్లుపట్టుకున్నారు. ఇంకొకరు మెడలు పట్టుకున్నారు. మరోవైపు లాఠీలతో ఒత్తిడిచేశారు. కారణాలు చెప్పకుండా తీసుకుపోవడం దారుణంగా ఉందన్నారు. ఎన్‌ఆర్‌ఐలను కూడా విడిచిపెట్టకుండా దురుసుగా వ్యవహరించారు. చిన్నప్పుడు ఎమర్జెన్సీ కాలంలో చూసింది నేడు అనుభవించాం. ఫోన్లు ట్యాపింగ్ చేశారు. చెప్పకూడని ప్రదేశాల్లో ఒత్తిడి చేసి గాయాలు చేశారు. పోలీసుల దమనకాండ తీవ్రంగా ఉంది. ఇంతటి పోలీసులు, దాడులను గతంలో ఎన్నడూ కూడా చూడనేలేదు. అశోక్‌నగర్ ప్రాంతంలో టియర్‌గ్యాస్ ప్రయోగించడం శోచనీయం. దాడి చేయాలనుకున్నప్పుడు ఏదైనా చేస్తారు. సందుల్లో వేలాది మంది ఉన్నారు. పోలీసులు దాడులకు దిగడం, టియర్ గ్యాస్ ప్రయోగించారు. యూనివర్శిటిలో కృష్ణ పరిస్థితి దారుణంగా ఉంది. మరో ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యారు. ఇప్పటివరకు సిఎం, కాంగ్రెస్ కు ఏమైనా ప్రతిష్ట ఉంటే ఈఘటనతో పూర్తిగా పాడైపోయిందన్నారు. గుర్తించలేని సంఘటనలు కాంగ్రెస్ అనుభవిస్తుంది. గ్రామాలకు వచ్చినప్పుడు టిజెఎసి నిలదీస్తుందని, మంత్రులు ఎమ్మెల్యేలను అడ్డుకుని తీరుతామన్నారు. పోలీసులుఎప్పుడు ప్రవర్తించని తీరును అవలంబించారన్నారు. ఎక్కడికక్కడ చెప్పుకోలేని ప్రదేశాల్లో గాయాలు చేశారని ఆరోపించారు. ఇక భవిష్యత కార్యాచరణపై దృష్టి పెడతామన్నారు. చలో అసెంబ్లీతో తెలంగాణ ఆకాంక్షను చాటటడమే గాకుండా విజయవంతం చేయగలిగామన్నారు.
తెలంగాణా బంద్‌కు కేసిఆర్ పిలుపు
చలో అసెంబ్లీ సందర్బంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుకు నిరసనగా శనివారం బంద్ పాటించాలని టిఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. బంద్‌లో విద్యాసంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్‌లు, అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్రంలో పోలీసులు వ్యవహరించిన తీరు, అణచివేతకు నిరసన తెలిపేందుకే ఈ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు, ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కేసీఆర్ కోరారు. పోలీసులు రాజకీయ నేతలను, విద్యార్థులను, ఉద్యోగులను, మహిళలను, ఏ ఒక్కరిని కూడా గౌరవించకుండా దమననీతికి పాల్పడ్డాయని, దీనిని ప్రతిఘటించేందుకు బంద్‌ను తప్పనిసరిగా పాటించాల్సిందేనని పిలుపునిచ్చారు. చలో అసెంబ్లీ సందర్బంగా అరెస్ట్ చేసిన తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుమతి నివ్వకపోయినా కూడా వేలాది మంది హైదరాబాద్‌కు తరలివచ్చి తమ ఆకాంక్షను నిరూపించారని, ఇప్పటికైనా కిరణ్‌కుమార్ రెడ్డి, కేంద్రం ఇచ్చిన మాటను నిలపెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నం.. లాఠీచార్జి, అరెస్ట్
చలో అసెంబ్లీ కార్యక్రమం ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ వద్ద పోలీసు బలగాలు విపరీతంగా ఉండడంతో తమ పంథాను మార్చుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయంకు చెందిన విద్యార్థుల బృందం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని ముట్టడిరచేందుకు ప్రయత్నించాయి. సుమారు ఇరవై మందికిపైగా విద్యార్థులు క్యాంపు కార్యాలయానికి చేరుకునే సరికే అక్కడే ఉన్న పోలీసు బలగాలు రంగంలోకి దిగి ఆందోళన కారులను అరెస్ట్‌చేశారు. దీంతో జై తెలంగాణనినాదాలు మార్మోగాయి. ఈ సమయంలో పోలీసులు లాఠీచార్జ్ ప్రయోగించారు. చివరికి ఆందోళనకారులను అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
[జనంసాక్షి సౌజన్యంతో ]