mt_logo

“చలో అసెంబ్లీ” తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక హక్కు

“చలో అసెంబ్లీ” ప్రజాస్వామిక హక్కు అని, ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తే ప్రతిఘటన తప్పదని జేఏసీ చైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. సోమవారం టీ-జేఏసీ స్టీరింగ్‌ కమిటీ సమావేశమైంది. చలో అసెంబ్లీ విజయవంతం చేయడంపై చర్చించింది. భేటీ ముగిసిన అనంతరం జేఏసీ ప్రతినిధులతో కలిసి కోదండరాం విూడియాతో మాట్లాడారు.

ఎన్ని నిర్బంధాలు విధించినా చలో అసెంబ్లీ నిర్వహించి తీరతామని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం స్పష్టం చేశారు. చలో అసెంబ్లీకి అనుమతి ఇవ్వాలని గతంలోనే తాము కోరామని తెలిపారు. అనుమతి కోసం ఎవరూ తమను సంప్రదించ లేదని పోలీసు కమిషనర్‌ చెప్పడం సరికాదన్నారు. అనుమతి ఇవ్వాలని ఈ నెల 6నే తాము కోరినట్లు తెలిపారు. చలో అసెంబ్లీని అణచివేసేందుకు ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందని ధ్వజమెత్తారు. బెదిరింపులు, బైండోవర్ల పేరుతో ఉద్యమకారులను భయపెట్టాలని చూస్తోందని విమర్శించారు. ఎన్ని నిర్బంధాలు విధించినా చలో అసెంబ్లీని విజయవంతం చేస్తామని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడే పార్టీలను కలుపుకొని పోతామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, సీపీఐ ఎమ్మెల్యేలతో సాయంత్రం మగ్ధూంభవన్‌లో సమావేశం కానున్నట్లు చెప్పారు. ఈ నెల 14న నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంపై చర్చించనున్నట్లు తెలిపారు. చలో అసెంబ్లీని అడ్డుకొంటే కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. చలో అసెంబ్లీకి పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పోలీసులు అడ్డుకుంటే ఎక్కడికక్కడే నిరసనలు తెలపాలని సూచించారు.

చలో అసెంబ్లీకి భారీగా సన్నాహాలు చేపడుతున్నట్లు జేఏసీ కో-కన్వీనర్‌ మల్లేపల్లి లక్ష్మయ్య తెలిపారు. అరెస్టులు, బైండోవర్ల పేరుతో ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. చలో అసెంబ్లీకి అనుమతి కోరలేదని సీపీ అబద్దాలు ఆడుతున్నారని విమర్శించారు. ఈ నెల ఆరునే అనుమతి ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అనుమతి ఇవ్వబోమని పోలీసు కమిషనర్‌ చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. బైండోవర్లు, పోలీసుల బెదిరింపులపై సీఎం, గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌, టీడీపీలను చలో అసెంబ్లీకి ఆహ్వానించడం లేదన్నారు.


[నమస్తే తెలంగాణ, జనంసాక్షి సౌజన్యంతో]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *