mt_logo

పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై వెనక్కు తగ్గిన కేంద్రం!

ఖమ్మం జిల్లాలోని ఏడుమండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలుపుతూ కేంద్రప్రభుత్వం తెచ్చిన పోలవరం ఆర్డినెన్స్ బిల్లును సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా టీఆర్ఎస్ ఎంపీలంతా ముక్తకంఠంతో అడ్డుకున్నారు. నినాదాలు చేస్తూ బిల్లును లోక్‌సభలో సాంకేతికంగా ప్రవేశపెట్టడానికి సాధ్యం కాని పరిస్థితి కల్పించారు. దీనితో హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ బిల్లును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సోమవారం పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాకముందే టీఆర్ఎస్ ఎంపీ బీ వినోద్ లోక్ సభ సెక్రెటరీ జనరల్ ను కలిసి రూల్ నం. 72ప్రకారం నోటీసును అందజేశారు. రాష్ట్రపతి ఆమోదం లేకుండా ఈ బిల్లును కేంద్రం సభలో ప్రవేశపెట్టడానికి ప్రయత్నిస్తోందని, ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్ర సరిహద్దులు మార్చే పోలవరం ఆర్డినెన్స్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12గంటల తర్వాత బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉన్నప్పటికీ ఎంపీ వినోద్ నోటీస్ ఇవ్వడంతో హోంమంత్రి బిల్లును వాయిదా వేసుకుంటున్నట్లు ప్రకటించారు.

పార్లమెంటు సమవేశాలు ప్రారంభం కాగానే టీఆర్ఎస్ ఎంపీలంతా లేచి నిలబడి కేంద్ర సర్కార్ కా జులుం తెలంగాణ మే నహీ చలేగా, నహీ చలేగా, సేవ్ అదివాసీస్ అని నినాదాలు చేయడంతో బిల్లును తాత్కాలికంగా వాయిదా వేశారు. రాష్ట్రపతి అనుమతి కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు హోంమంత్రి చెప్పడంతో కొంతమేరకు విజయం సాధించినట్లేనని టీఆర్ఎస్ ఎంపీలు సంతోషం వ్యక్తం చేశారు.

ఎంపీ బీ వినోద్ మాట్లాడుతూ, పోలవరం ఆర్డినెన్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలంటే రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరన్నారు. రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకునే నిమిత్తం బిల్లును పంపాలని, కానీ అవేవీ లేకుండానే పార్లమెంటులో ప్రవేశపెట్టడం రాజ్యాంగవిరుద్ధమని పేర్కొన్నారు. రాష్ట్రాల సరిహద్దులను మార్చాలంటే అర్టికల్ 3 ప్రకారం జరగాలని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *