mt_logo

స్థానికఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కారు..

ఇటీవల జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈరోజు ఉదయం నుండీ మొదలైంది. తెలంగాణలో కారు జోరుగా బ్రేకుల్లేకుండా వెళ్తూ అన్ని జిల్లాలలో విజయకేతనం ఎగురవేస్తూ ముందుకు దూసుకుపోతుంది. రంగారెడ్డి జిల్లాలోని పరిగిలో 7ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా, ఆదిలాబాద్ జిల్లాలో 10ఎంపీటీసీ స్థానాలను గెలుచుకుంది. పాలమూరులో దూకుడుమీదున్న కారు మధ్యాహ్నం 12గంటల సమయంలో 8ఎంపీటీసీ స్థానాలు గెలుపొందగా, టీడీపీకి ఒక్క స్థానమూ దక్కలేదు.

నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం వరకు జరిగిన కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ 29ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 12స్థానాలను గెలుపొందింది. ఖమ్మం జిల్లాలో టీడీపీ ముందంజలో ఉండగా కారు కాస్త వెనుకపడింది. ఇక మేడ్చల్ లో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఒంటిగంటలోపే పూర్తవ్వగా, టీడీపీ-7, బీజేపీ-6, కాంగ్రెస్-2, టీఆర్ఎస్-1 స్థానాన్ని గెలుచుకున్నాయి. అనంతరం జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. కేసీఆర్ స్వస్థలం మెదక్ జిల్లా చింతమడకలో టీఆర్ఎస్ ఎంపీటీసీ అభ్యర్థి దేవవ్వ 1050 ఓట్ల మెజారిటీతో గెలుపొందింది. మరోవైపు మాజీ మంత్రి శ్రీధర్ బాబు సొంతగ్రామమైన కాటారం మండలం ధన్వాడలో టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందింది.

ఉత్తర తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం 2.30గంటలవరకు 184 స్థానాలకు గానూఫలితాలు వెలువడగా, అందులో టీఆర్ఎస్-82, కాంగ్రెస్-60, టీడీపీ-10, వామపక్షాలు-1, ఇతరులు-31స్థానాలు కైవసం చేసుకున్నాయి. జెడ్పీటీసీ ఫలితాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ ముందుకు దూసుకుపోతుంది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట స్థానాన్ని టీఆర్ఎస్ అభ్యర్థి అన్నపూర్ణ కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల నియోజకవర్గంలోని మూడు మండలాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ముందుకు దూసుకుపోతూ జిల్లా పరిషత్ చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 36 జెడ్పీటీసీ స్థానాలకు గానూ టీఆర్ఎస్ పార్టీ 23, కాంగ్రెస్ పార్టీ 13 స్థానాలను గెలుపొందింది. సాయంత్రం అయ్యేసరికి జరిగిన లెక్కింపులో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం 52 జెడ్పీ స్థానాలకు గానూ ప్రకటించిన 38 స్థానాల్లో టీఆర్ఎస్-27, కాంగ్రెస్-7, టీడీపీ-2, బీఎస్పీ-2 స్థానాలు కైవసం చేసుకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *