శనివారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర క్యాబినెట్ కీలక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో తక్షణం దృష్టి సారించాల్సిన అనేక అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా ఈనెల 23 నుండి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై కూడా చర్చించనున్నట్లు, అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు ముసాయిదాలు, చర్చించాల్సిన అనేక అంశాలకు సంబంధించిన నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకోనున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి బృందం చైనా పర్యటనకు సంబంధించిన అనుభవాలను కూడా ఈ సమావేశంలో వివరించనున్నారు. వీటికి సంబంధించి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు.
అనంతరం వ్యవసాయం, వర్షాలపై సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో చర్చించారు. జూలై, ఆగస్టు నెలల్లో వర్షాలు అనుకున్న విధంగా లేకపోయినప్పటికీ, సెప్టెంబర్ లో మంచి వర్షాలు పడుతున్నాయని, ఇది రైతులకు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఖరీఫ్ లో నష్టపోయిన రైతులను అన్నివిధాలుగా ఆదుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల్లో మంచి వర్షాలు పడటం శుభసూచకమని, రాష్ట్రం తీవ్ర కరువు నుండి బయటపడినట్లేనని, రాబోయే రెండు మూడు రోజుల్లోనూ మంచి వర్షాలు పడే అవకాశం ఉందని సీఎం అన్నారు.
ఈ వర్షాల వల్ల చాలా జిల్లాల్లో చెరువులు నిండాయని, భూగర్భ జలాలు పెరిగాయని, అందువల్ల రబీ సీజన్ కు, మంచినీటికి కొరత లేదన్నారు. జూన్ లో వేసిన పంటలు నష్టపోయినా జూలై నెలలో వేసిన పంటలు బతికే అవకాశం ఉందని, అధికారులు మండలాల వారీగా సర్వేలు జరిపి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవాలని సూచించారు. నష్టం జరిగిన రైతులకు సాయం చేసే విషయంలో తగిన ప్రతిపాదనలు తయారుచేయాలని సీఎం ఆదేశించారు.