ఈనెల 27నుండి ఆషాఢమాసం ప్రారంభం కానుండటం, ఆ తర్వాత మంచిరోజులు లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణ ఈలోగానే పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు అభిప్రాయపడుతున్నట్లు తెలిసింది. సీఎంగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన రోజే 11మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరో 6గురికి స్థానం లభిస్తుందని సమాచారం.
ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, కరీంనగర్ నుండి కొప్పుల ఈశ్వర్, వరంగల్ నుండి కొండా సురేఖకు తప్పకుండా బెర్తు లభిస్తుందని సమాచారం. మహబూబ్ నగర్ నుండి జూపల్లి కృష్ణారావు, వీ శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డిలు మంత్రిపదవులు ఆశిస్తున్నారు. మెదక్ జిల్లానుండి ఎన్నికైన బాబూమోహన్ మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఎస్టీ కోటా కింద మంత్రి పదవి వస్తుందని వరంగల్ కు చెందిన చందూలాల్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లానుండి మంత్రిపదవి కోసం బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్ రెడ్డి ఎదురుచూస్తున్నారు.