ఆదివారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సాయంత్రం ఐదు గంటలకు మొదలైన సమావేశం సుమారు మూడుగంటలపాటు కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నూతన పారిశ్రామిక విధానానికి ఈ సమావేశంలో ఆమోదముద్ర వేసినట్లు సమాచారం. అంతేకాకుండా మార్కెట్ కమిటీ నామినేటెడ్ పోస్టుల్లో ఎస్టీ, ఎస్సీలకు 22 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు, ఈవ్ టీజర్ల భరతం పట్టేందుకు, మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు రూపొందించబడిన మహిళా భద్రత, బాలికా సంరక్షణ బిల్లులకు సమావేశం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది.
వాటర్ గ్రిడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, గ్రామీణ రహదారుల అభివృద్ధి, గ్రామీణ, పట్టణ రహదారుల అభివృద్ధి కోసం రెండు కార్పొరేషన్ల ఏర్పాటు, సర్పంచులకు మరిన్ని అధికారాలు బదలాయించే బిల్లు, ఇంటర్మీడియట్ బోర్డు విభజన, హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం రూ. 100 కోట్ల నిధులు, నూతన ఇసుక కేటాయింపు విధానం, 33 కార్పొరేషన్లకు పేరు మార్పు తదితర అంశాలను ఆమోదించినట్లుగా సమాచారం. ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, జీఏడీ ముఖ్యకార్యదర్శి సునీల్ జోషి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు.