-స్వల్ప, దీర్ఘకాలిక లక్ష్యాలకోసం 14 టాస్క్‌ఫోర్స్‌లు
-యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికల రూపకల్పన
-టాస్క్‌ఫోర్స్‌లకు ప్రభుత్వ ఆదేశం
తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలా, ప్రజల ఆకాంక్షను నెరవేర్చేలా రాష్ట్ర బడ్జెట్ రూపుదిద్దుకోబోతున్నది. దీనిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు భారీ కసరత్తు చేశారు. బడ్జెట్ రూపకల్పనకోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా వినూత్న తరహాలో 14 టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేశారు. వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఆయా రంగాల నిపుణులు, ప్రభుత్వ సలహాదారులు ఈ టాస్క్‌ఫోర్స్‌లలో ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. పాత ప్రణాళికలకు, కాలంచెల్లిన విధానాలకు స్వస్తి చెప్పి, తెలంగాణ ప్రజల అవసరాలను, ఆకాంక్షలను తీర్చేవిధంగా బడ్జెట్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
దీంతోపాటు విధానాల రూపకల్పనకు స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక విధానాలను అనుసరించాలని సూచించారు. ఆయా టాస్క్‌ఫోర్స్‌ల కన్వీనర్లు తమ కమిటీలో సభ్యులు, నిపుణులు, ఏజన్సీలతో సంప్రదించి సమగ్ర ప్రణాళిక తయారుచేయాలని ఆదేశించారు. ఈ ఏడాది బడ్జెట్ రూపకల్పనకు అవసరమైన సిఫారసులను సెప్టెంబర్ 4లోపు ఆర్థిక, ప్రణాళిక శాఖకు నివేదించాలని టాస్క్‌ఫోర్స్‌ల కన్వీనర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ ఆదేశించారు.
సంక్షేమం, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, శాంతి భద్రతలు, మానవ వనరుల అభివృద్ధి, నీటిపారుదల-నీటివనరులు, ఆదాయవనరుల సమీకరణ తదితర అంశాలపై బడ్జెట్ రూపకల్పనకు టాస్క్‌ఫోర్స్‌లు పనిచేస్తాయి. ఇవి యుద్ధప్రాతిపదికన తమ లక్ష్యసాధనకోసం పని చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలకు అవసరమైన రీతిలో ప్రణాళికలు, బడ్జెట్ రూపొందించాలని సూచించింది.
సంక్షేమరంగంపై..
కన్వీనర్: దళితుల అభివృద్ధి, గిరిజన, వెనుకబడినవర్గాల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్‌పీటర్
లక్ష్యాలు: సంక్షేమ పథకాలను పటిష్ఠంగా అమలు చేయడం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళల అభివృద్ధికి కృషి చేయడం, వారిని సంక్షేమ కార్యక్రమాలలో భాగస్వాములను చేయడం, వృత్తి నైపుణ్యంపై శిక్షణనివ్వడంవంటి వాటిపై ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ, మహిళాసంక్షేమ, మైనార్టీ సంక్షేమశాఖల సెక్రటరీలులతోపాటు సెంటర్‌ఫర్ సోషల్ డెవలప్‌మెంట్, ఐఎల్‌ఎఫ్‌ఎస్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్.
నీటి సరఫరా, పారిశుద్ధ్యంపై..
కన్వీనర్: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రేమండ్‌పీటర్.
లక్ష్యాలు: వాటర్‌గ్రిడ్‌ల ఏర్పాటు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి వ్యవస్థను మెరుగుపర్చడం, మరుగుదొడ్ల నిర్మాణంతోపాటు బహిర్భూమికి వెళ్లడంవల్ల కలిగే అనర్ధాలపై ప్రచారంచేసి ప్రజల్లో పారిశుద్ధ్యం, ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి విస్తృత కార్యక్రమాలను చేపట్టడంవంటి వాటిపై ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, నీటిపారుదల ప్రిన్సిపల్ సెక్రెటరీ, హైదరాబాద్ మెట్రోవాటర్ బోర్డు మేనేజింగ్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేవ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, యునిసెఫ్ ప్రతినిధులు ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు.
వ్యవసాయ అనుబంధ కార్యక్రమాలు, విత్తన ఉత్పత్తికోసం..
కన్వీనర్: వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థకశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ పూనం మాలకొండయ్య.
లక్ష్యాలు: ఆయా జిల్లాల్లో నేలలకు అనువైన పంటలు వేయడం, సూక్ష్మ నీటిపారుదల వ్యవస్థను ఏర్పాటుచేయడం, గ్రీన్‌హౌస్ కల్టివేషన్, విత్తనోత్పత్తి, కోళ్ల, పాడి, మత్స్య పరిశ్రమలను అభివృద్ధి చేయడం, పశుసంపదను పెంపొందించడం వంటి వాటిపై బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: నీటిపారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ, కేంద్ర ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ సభ్యులు ప్రొఫెసర్ అర్జులారెడ్డి, నేషనల్ ఎగ్ కో ఆర్డినేషన్ కౌన్సిల్, ఫార్మర్స్, రూరల్ సైన్స్ ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారు ఏకే గోయల్.
పరిశ్రమలు, పెట్టుబడులపై..
కన్వీనర్: పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ కే ప్రదీప్‌చంద్ర.
లక్ష్యాలు: ఆకర్షణీయమైన పారిశ్రామిక విధాన రూపకల్పన, అనుమతులకోసం సింగిల్ విండో విధానం, ఉత్పాదకరంగ అభివృద్ధి, ఫుడ్ ప్రాసెసింగ్, పన్నుల హేతుబద్ధీకరణ, ఫార్మాసిటీ అభివృద్ధి, కేంద్ర ప్రత్యేక ప్యాకేజీల కింద వచ్చే రాయితీలతో అభివృద్ధి చేసుకునేందుకు ప్రాంతాల గుర్తింపువంటి వాటిపై ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: విద్యుత్, ప్రణాళిక శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, టీఎస్‌ఐఐసీ ఎండీ, పీసీబీ సభ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, ఐఐసీటీ సైంటిఫిక్ అడ్వయిజర్ కేవీ రాఘవన్, సీఐఐ, ఫిక్కీ, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్, స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు.
మానవనరుల అభివృద్ధికి..
కన్వీనర్: వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేశ్ చంద్ర.
లక్ష్యాలు: అక్షరాస్యత పెంపొందించడం, జీవన ప్రమాణాలు, జీవనవిధానాలను మెరుగుపర్చడం, మానవ వనరుల అభివృద్ధి సంస్థలను పటిష్ఠపర్చడంవంటి వాటిపై ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆర్థికశాఖ స్పెషల్ సెక్రటరీ, నిమ్స్ డైరెక్టర్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సిస్టమ్స్, యూనిసెఫ్ ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి.
నీటిపారుదల, నీటివనరులపై
కన్వీనర్: నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్‌కే జోషి
లక్ష్యాలు: భారీ, ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తిచేయడం, ఆయకట్టు స్థిరీకరణ, చిన్న నీటిపారుదల వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలవనరుల పెంపు కోసం ప్రణాళికలను తయారుచేయడంవంటి వాటిపై ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయశాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీ, వాలంతరీ, సీజీజీ ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారు ఆర్ విద్యాసాగర్‌రావు.
విద్యుత్‌పై..
కన్వీనర్: విద్యుత్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎస్‌కేజోషీ
లక్ష్యాలు: విద్యుత్ ఉత్పాదనను పెంచడం, సింగరేణి కాలరీలను పునర్వ్యవస్థీకరించడం, సంప్రదాయేతర విద్యుత్ వనరులను పెంపొందించడం, విద్యుత్ పొదుపువంటి వాటిపై ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, వ్యవసాయశాఖ కార్యదర్శి, సింగరేణి కాలరీస్ సీఎండీ, ఏఎస్‌సీఐ నుంచి టీఎల్ శంకర్, ప్రొఫెసర్ ఎమిరిటస్.
ప్రత్యేక ఆహ్వానితులు: ఏకే గోయల్.
పర్యావణం-వాతావరణంపై..
కన్వీనర్: అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ
లక్ష్యాలు: చెరువులను, కుంటలను రక్షించడం, విస్తృతంగా పచ్చదనాన్ని విస్తరించడం, నీటియాజమాన్య పద్ధతులు, రీసైక్లింగ్ విధానాలపై సమగ్ర ప్రణాళిక రూపొందించడంవంటి వాటిపై ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హెచ్‌ఎండీఏ కమిషనర్, పీసీబీ సభ్య కార్యదర్శి, అటవీశాఖ పీసీసీఎఫ్, ఈపీటీఆర్‌ఐ, ఏఎస్‌సీఐ ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి.
న్యాయ, పరిపాలన సంస్కరణలపై..
కన్వీనర్: సాధారణ పరిపాలనా శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రా.
లక్ష్యాలు: న్యాయపరమైన విధానాల్లో మార్పు, ఆయా విభాగాల, శాఖల చట్టాలు, నిబంధనలను అవసరమైన మేరకు మార్పులు చేయడం, పంచాయతీరాజ్ పట్టణ, స్థానిక సంస్థలను, ఏజన్సీలను పునర్వ్యవస్థీకరించడంవంటి వాటిపై ప్రణాళిక, బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్, పురపాలకశాఖ, హోంశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, న్యాయశాఖ కార్యదర్శి, డీజీపీ, నల్సార్ యూనివర్సిటీ, సీజీజీ ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: అడ్వకేట్ జనరల్, ప్రభుత్వ సలహాదారు బీవీ పాపారావు.
మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్..
కన్వీనర్: ప్రణాళిక శాఖ బీపీ ఆచార్య.
లక్ష్యాలు: ప్రభుత్వ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షించి, వాటి అమలు తీరును పరిశీలించడం, నాణ్యత ప్రమాణాలను పాటించడంలో విచారణ, పథకాల అమలుపై ఇండికేటర్స్ తయారీ, ప్రణాళికను వికేంద్రికరించడంవంటి వాటిపై బడ్జెట్ రూపకల్పన.
సభ్యులు: ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, సెస్ ప్రతినిధులు
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారులు ఏకే గోయల్, జీఆర్ రెడ్డి.
రిసోర్సెస్ మొబిలైజేషన్స్ (వనరుల సమీకరణ)
కన్వీనర్: ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నాగిరెడ్డి.
లక్ష్యాలు: పన్నుల విధానంలో సంస్కరణలు తేవడం, ప్రభుత్వ ఆదాయ వనరులను పెంపొందించడం, వనరుల సమీకరణ వంటి అంశాలపై ప్రణాళిక రూపకల్పన.
సభ్యులు: ప్రణాళిక, రెవెన్యూ, రవాణాశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, పరిశ్రమలశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, సెస్ ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వసలహాదారు జీఆర్‌రెడ్డి.
శాంతిభద్రతలపై..
కన్వీనర్: హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ అజయ్‌మిశ్రా.
లక్ష్యాలు: పోలీస్ వ్యవస్థను పటిష్టపర్చడం, స్నేహపూర్వక పోలీసింగ్ విధానం అమలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా నేరాలను నియంత్రించడం.
సభ్యులు: ఐటీ శాఖ కార్యదర్శి, డీజీపీ, అప్పా డీజీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సీజీజీ ప్రతినిధులు.
ప్రత్యేక ఆహ్వానితులు: ప్రభుత్వ సలహాదారు రామలక్ష్మణ్.
[నమస్తే తెలంగాణ సౌజన్యంతో]