mt_logo

దీపావళి తర్వాత బడ్జెట్ సమావేశాలు..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరగబోయే తొలి బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్దమవుతోంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఈ బడ్జెట్ లో ఉండనున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బడ్జెట్ రూపకల్పన జరిపి 14 టాస్క్ ఫోర్స్ కమిటీలు తమ నివేదికలను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు సమర్పించారు. సోమవారం మాదాపూర్ హెచ్ఐసీసీ లోని న్యాక్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో దాదాపు ఏడు గంటలపాటు సుదీర్ఘ సమావేశం నిర్వహించిన అనంతరం సీఎం బడ్జెట్ కు తుదిరూపు ఇచ్చారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, వచ్చే నాలుగేండ్లకు ఈ బడ్జెట్ ఆదర్శంగా నిలవాలని, శాఖలకు తగిన నిష్పత్తిలో నిధుల కేటాయింపు ఉండాలని అన్నారు. మహిళా, శిశు సంక్షేమానికి భారీగా నిధులు విడుదల చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిసింది. దాదాపు రూ. 85 వేల కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సమావేశంలో ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు ఎక్కువగా ప్రభుత్వ దవాఖానలలోనే నిర్వహించాలని, బోధనాస్పత్రులను బలోపేతం చేయాలని, తర్వాతే కొత్త వాటిపై దృష్టి పెడదామని కేసీఆర్ అధికారులకు సూచించినట్లు సమాచారం.

ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలని, గాంధీ, ఉస్మానియాతో పాటు సుల్తాన్ బజార్ మెటర్నిటీ ఆస్పత్రి, నీలోఫర్ దవాఖానల్లో మరింత మెరుగైన సేవలను అందించేందుకు అధికారులు శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. వరంగల్ లో కాళోజీ హెల్త్ యూనివర్సిటీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మించాలని అధికారులకు సూచించారు. అంతేకాకుండా గతనెల 29 నుండి సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్ల మొండి వైఖరిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ, జూడాలు సంవత్సరం పాటు గ్రామాల్లో సర్వీసులు అందించాల్సిందేనని, వారిపట్ల కఠినంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *