రాష్ట్రంలోని అన్ని ప్రధాన నగరాలను అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని, రేపటి తెలంగాణలో ఈ ఐదు జిల్లాలు కీలక నగరాలుగా ఉంటాయని సీఎం కేసీఆర్ ప్రకటించారు. మంగళవారం సచివాలయంలో తనను కలిసిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, అసెంబ్లీ, రాజ్ భవన్, సీఎం నివాసాల ముందు చిన్న వర్షం వచ్చినా నీళ్ళు నిలిచిపోతున్నాయని, ఇందుకోసం రూ. 10 వేల కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అధికారులు అంచనా వేసినట్లు తెలిపారు.
ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సరిగాలేదని, అందుకే ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై దృష్టి సారించినట్లు, హైదరాబాద్ తర్వాత పెద్ద నగరమైన వరంగల్ కూడా సమగ్రాభివృద్ధి సాధించాలని కేసీఆర్ చెప్పారు. ఖమ్మం, నల్గొండ పట్టణాలు నలువైపులా విస్తరిస్తాయని, వాటికి కూడా నగర స్వరూపం వస్తుందన్నారు. రామగుండం మాదిరిగానే కొత్తగూడెం కూడా అభివృద్ధి చెందుతుందని, కొత్తగూడెంలో 4000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ త్వరలోనే వస్తుందని, దీనివల్ల 10 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని సీఎం హామీ ఇచ్చారు. బడ్జెట్ సమావేశాల తర్వాత తానే స్వయంగా ఈ ఐదు జిల్లాల్లో పర్యటిస్తానని, హైదరాబాద్ తో పాటు తెలంగాణలో ఉన్న మిగతా పట్టణాలను, కార్పొరేషన్లను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్ చెప్పారు.