శాసనసభలో బడ్జెట్ పై చర్చ ప్రారంభం అవ్వగానే ప్రతిపక్ష నేత జానారెడ్డి మాట్లాడుతూ, బడ్జెట్ లో వివిధ వర్గాలకు కేటాయించిన లెక్కలు సమగ్రంగా లేవని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రణాళికాయుతంగా పూర్తిచేయాల్సిన అవసరం ఉందని, మరింత సమయం తీసుకుని లెక్కలు సరిచేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఇన్నాళ్ళూ మూసలో ఉన్న వారికి ప్రతిదీ ఒక అద్భుతంగానే కనిపిస్తుందని, అద్భుతంగా బాగుపడదామనే తెలంగాణ సాధించుకున్నామని అన్నారు.
తెలంగాణలో వందశాతం అద్భుతాలు జరుగుతాయని, తెలంగాణ ప్రజలు కొట్లాడింది కూడా అద్భుతాలు జరగాలనే అని, కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ అభివృద్ధి సాధిస్తుందని, అప్పుడు మీరే మమ్మల్ని ప్రశంసిస్తారని కేసీఆర్ పేర్కొన్నారు. మీరు ప్రవేశపెట్టిన పథకాలకు నిధులు ఎలా తెస్తారో చెప్పాల్సిన అవసరం ఉందని జానారెడ్డి ప్రశ్నించగా సీఎం వివరణ ఇస్తూ, స్టేట్ ఓన్ ట్యాక్స్(ఎస్వోటీ) ద్వారా రూ. 35 వేల కోట్లు తీసుకోవడానికి ఆస్కారం ఉందని, రూ. 11 వేల కోట్లను ఎఫ్ఆర్బీఎం ద్వారా సేకరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పెంచితే తప్ప ఎఫ్ఆర్బీఎం పెరగడాని, 3 శాతం నుండి ఎఫ్ఆర్బీఎం ను పెంచాలని ఇదివరకే కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కోరినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.