బడ్జెట్ బిల్లుకు శాసనసభ, శాసనమండలిలో ఏకగ్రీవ ఆమోదం లభించింది. కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, ఎంఐఎం, వైసీపీ పార్టీలు మద్దతు తెలిపాయి. బిల్లు ఆమోదం పొందగానే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు.అంతకుముందు బిల్లుపై శాసనసభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ నేత జానారెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ ను తాము బలపరుస్తున్నామని, అభివృద్ధికి తాము ఎప్పుడూ అడ్డుతగలమని, కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని సూచించారు.
అనంతరం బీజేపీ ఎమ్మెల్యే కే లక్ష్మణ్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆత్మవిశ్వాసాన్ని అభినందిస్తున్నామని, బంగారు తెలంగాణ కోసం రాజకీయాలకతీతంగా కేంద్రంతో చర్చలు జరపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తాము నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని, ద్రవ్య వినిమయ బిల్లును పూర్తిగా సమర్ధిస్తున్నట్లు లక్ష్మణ్ తెలిపారు.