నల్గొండ జిల్లా బీబీనగర్ నిమ్స్ ఆస్పత్రిని కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో అభివృద్ధి చేస్తామని, తెలంగాణకే తలమానికంగా నిమ్స్ ఉండబోతోందని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి టీ రాజయ్య చెప్పారు. 93 కోట్ల నిధులతో భవనాలు నిర్మించినప్పటికీ ఉపయోగం లేకుండా పడున్నాయని, వెంటనే బీ, డీ బ్లాకుల్లో సివిల్ పనులు ప్రారంభించి రెండు నెలల్లో ఓపీ సేవలు ప్రారంభించి ప్రజలకు వైద్యసేవలు అందించాలని అధికారులకు సూచించారు.
మంగళవారం నిమ్స్ లో ఏర్పాటు చేసిన అధికారుల సమీక్షాసమావేశంలో పాల్గొన్న మంత్రి రాజయ్య పలు అంశాలపై చర్చలు జరిపారు. నిమ్స్ ఖాతాలో ప్రస్తుతం ఉన్న 5కోట్ల రూపాయలనుండి నీటిసరఫరా కోసం 84లక్షలు, కరెంటు సరఫరాకు 34లక్షలు మంజూరు చేసి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బీబీనగర్ నిమ్స్ ను మూడు దశలుగా తీర్చిదిద్దాలని, ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంగా రోడ్, రైల్వే సదుపాయాలు ఉన్న ఈ నిమ్స్ ను ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
అంతేకాకుండా పక్కనే ఉన్న మరో వందెకరాల భూదాన్ భూమిని సేకరించి అన్ని విభాగాలు ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం మంజూరు చేసిన కాన్సర్ ఆసుపత్రిని ఈ స్థలంలోనే ఏర్పాటు చేస్తే ప్రయోజనం ఉంటుందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో భువనగిరి ఎంపీ డాక్టర్ బూరనర్సయ్య గౌడ్, ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.