పీవీకి భారతరత్న ఇవ్వాలి: మాజీ ఎంపీ కవిత

  • August 26, 2020 5:04 pm

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు దేశ అత్యుత్తమ పురస్కారం భారతరత్న ఇవ్వాలని మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కోరారు. పీవీ జయంత్యుత్సవాల్లో భాగంగా హైదరాబాద్ లో బుధవారం సమాలోచన సభ నిర్వహించారు. తెలంగాణ తేజం మన పీవీ (సాహితీ సౌరభం- అసమాన దార్శనికత) పేరుతో మాజీ ఎంపీ కవిత అధ్యక్షతన ఈ సభ జరిగింది. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా పీవీ ప్రధాని పదవి చేపట్టారని, పీవీ సేవలను యువతరానికి తెలియజేసేలా రాష్ట్రవ్యాప్తంగా శతజయంతి ఉత్సవాలను నిర్వహించాల్సిందిగా తెలంగాణ జాగృతి నాయకులకు ఆమె పిలుపునిచ్చారు.


పీవీ నరసింహారావు గారి మేధస్సును, సాహిత్యాన్ని యువతరానికి చేరేలా తెలంగాణ జాగృతి ప్రతినెలా రెండు కార్యక్రమాలు చేపట్టనుందని కవిత ప్రకటించారు. పీవీ బుక్ క్లబ్ పేరుతో ప్రాచీన పుస్తకం, నవీన పుస్తకం పేరుతో ప్రతినెలా రెండు కార్యక్రమాలు నిర్వహించి పీవీకి అక్షర నివాళి అందిస్తున్నామని అన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్ధులు సైతం పొగిడే విధంగా హుందాతనంతో పీవీ వ్యవహరించారని, తన మేధస్సును దేశం కోసం ఉపయోగించారని కవిత ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పీవీ శతజయంతి ఉత్సవాల కమిటీ అధ్యక్షుడు కే. కేశవరావు, పీవీ తనయుడు ప్రభాకర్ రావు, కుమార్తె వాణి దేవి, టీఆర్ఎస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మహేష్ బిగాల, రచయిత కల్లూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


Connect with us

Videos

MORE