తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకంపై దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రశంసల జల్లు కురిపిస్తున్నాయి. మొన్న ఉత్తరప్రదేశ్, నిన్న బీహార్, ఈరోజు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తాగునీటి పథకాన్ని కీర్తిస్తున్నాయి. మంచినీటిని అందించేందుకు భగీరథ ప్రయత్నం చేస్తున్నారని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశంసించారు. బెంగాల్ లోనూ ఇలాంటి పథకాన్ని ప్రారంభించే ఆలోచనతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునేందుకు అధికారుల బృందాన్ని మన రాష్ట్రానికి పంపారు. ఆ రాష్ట్రానికి చెందిన పబ్లిక్ హెల్త్ ఇంజినీర్ డిపార్ట్ మెంట్ కు చెందిన ముగ్గురు అధికారులు బుధవారం పంచాయితీ రాజ్ శాఖామంత్రి కేటీఆర్ తో సమావేశమై ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్నారు. వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి మంత్రి వివరిస్తూ తెలంగాణ ఆడపడుచులెవరూ మంచినీటి కోసం ఇబ్బందులు పడొద్దన్న ఉద్దేశంతో తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రాజెక్టును చేపట్టారని తెలిపారు.
కేంద్రప్రభుత్వం కూడా ఈ ప్రాజెక్టును అభినందించిందని, రానున్న మూడున్నరేళ్ళలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు కూడా అడగమని సీఎం కేసీఆర్ వాగ్ధానం చేశారని కేటీఆర్ వారికి చెప్పారు. బెంగాల్ లో ఉన్న నీటి సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలంగాణ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ లాంటి పథకాన్ని ప్రారంభించాలన్న యోచనలో ఉన్నారని అధికారుల బృందం మంత్రికి తెలిపారు. బెంగాల్ లో ప్రాజెక్టు ప్రారంభించాలనుకుంటే అందుకు సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా అంతకుముందు ఉదయం ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ కార్యాలయంలో ప్రాజెక్టు ఈఎన్సీ బీ సురేందర్ రెడ్డి బెంగాల్ అధికారులకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాటర్ గ్రిడ్ పథకాన్ని వివరించారు.