బతుకమ్మ సంబురాలు రెండవరోజు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలోని సింగరేణి గ్రౌండ్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు సారధ్యంలో జరిగిన బతుకమ్మ ఉత్సవాలకు మహిళలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల భద్రతకు, రక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా ప్రకటించినందున ఈ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహిస్తున్నదని తెలిపారు. బతుకమ్మ ఉత్సవాల ద్వారా మహిళలు స్వరాష్ట్ర సాధన కోసం చేసిన కృషి మరువలేనిదని, రాష్ట్ర సాధన ఉద్యమంలో మహిళలు గొప్ప పాత్ర పోషించారని కవిత అన్నారు.
మహిళల స్పందన చూస్తుంటే బతుకమ్మ పండుగతో పాటు రాష్ట్ర పండుగలకు, సంస్కృతి, సంప్రదాయాలకు రానున్న తరాల్లో కూడా ఇదే స్ఫూర్తి ఉంటుందని స్పష్టమవుతుందన్నారు. మహిళా లోకం ఇదే స్ఫూర్తి కొనసాగించాలని, రాష్ట్రాన్ని సాధించుకున్న మనం బంగారు తెలంగాణను నిర్మించుకోవడానికి కృషి చేసినప్పుడే నిజమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్లని పేర్కొన్నారు. అనంతరం ఆమె టేకులపల్లి మండలం సూర్యాతండా నుండి వచ్చిన గిరిజన మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్యేలు మదన్ లాల్, కనకయ్య, ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పూల రవీందర్, మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి తదితరులు పాల్గొన్నారు.