బంజారాహిల్స్ రోడ్ నం. 10 లో బంజారా, ఆదివాసీ, బాబూ జగ్జీవన్ రాం భవన్లకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈరోజు శంకుస్థాపన చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన సీఎం కేసీఆర్ కు బంజారాలు, ఆదివాసీలు డప్పులు, వాయిద్యాలతో సంప్రదాయ నృత్యాలు చేస్తూ స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ, సమైక్య రాష్ట్రంలో 60 ఏండ్లు అప్లికేషన్లు పట్టుకుని ఆఫీసుల చుట్టూ తిరిగినా ఒక్క సెంటు భూమి కేటాయించలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లో బంజారా, ఆదివాసీల భవన్లను కేటాయించినందుకు సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామని చెప్పారు. సీఎం కేసీఆర్ తోనే రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధి జరుగుతుందని, తండాలను, గూడెంలను గ్రామపంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందని కీర్తించారు. గిరిజన, ఆదివాసీల కోసం కళ్యాణ లక్ష్మి పథకం వరం లాంటిదని సీతారాం నాయక్ పేర్కొన్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, ఉద్యమసమయంలో తాను ఇచ్చిన మాట ప్రకారం బంజారా హిల్స్ లో బంజారా, ఆదివాసీ భవనాలు కట్టిస్తున్నామని, బంజారాలు హైదరాబాద్ లో కమ్యూనిటీ హాల్ కట్టుకుందామనుకున్నా అది నెరవేరలేదన్నారు. మా తండాలో మా రాజ్యం కావాలని దశాబ్దాలుగా కోరుతున్నారని, జల్, జంగల్, జమీన్ నినాదంతో గోండులు పోరాడారని సీఎం పేర్కొన్నారు. గిరిజన ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలకు జిల్లాకు పది లక్షల చొప్పున రూ. 90 లక్షలు కేటాయిస్తామని, ఏ గిరిజన బిడ్డ పెళ్లి జరిగినా రూ. 51 వేలు ఇస్తామన్నారు.
సమైక్య రాష్ట్రంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని, గిరిజనులకు కూడా మూడెకరాల భూ పంపిణీ చేస్తామని సీఎం స్పష్టం చేశారు. తండాలను గ్రామ పంచాయితీలుగా చేసేందుకు ఆదేశాలు జారీ చేశామని, త్వరలోనే అవి అమలు కానున్నాయని చెప్పారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామంటే కొందరు అపోహలు సృష్టించారని, అందరికీ సమానమైన హక్కులు కల్పించడానికే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేసీఆర్ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో నిర్లక్ష్యానికి గురైన దళిత, గిరిజన, ఆదివాసీలు దేశంలోనే ఉన్నతంగా బతికే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. రాష్ట్రంలో వందలాది తండాలకు రోడ్డు సౌకర్యం లేదని, రానున్న నాలుగేళ్ళలో రోడ్డు లేని తండా ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు.
తండాలు, గోండు గూడెంలలో అంటువ్యాధులతో చాలామంది చనిపోతున్నారని, ఈ విషయమై హైదరాబాద్ లోని చాలామంది వైద్యులతో మాట్లాడానని, 500 మంది వైద్యులతో తండాలలో అవగాహన కల్పిస్తామని చెప్పారు. నాటుసారా, కల్తీసారా విధానాలను రూపుమాపాలని, సరైన తిండి తిని సరైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రైబల్ సబ్ ప్లాన్ నిధులు ఇతరులకు మళ్ళించబడవని, గిరిజనుల కోసమే ఖర్చు చేస్తామని, త్వరలో గిరిజన విభాగానికి గిరిజన మంత్రిని నియమిస్తామని సీఎం హామీ ఇచ్చారు.