రైతుల ఆత్మస్థైర్యాన్ని దిబ్బతీసేవిధంగా కొన్ని మీడియా సంస్థలు వ్యవహరిస్తున్నాయని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. తెలంగాణ భవన్ లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొన్ని పచ్చ పత్రికలు చూస్తున్నాయని, ఇతర కారణాలతో ఆత్మహత్య చేసుకున్నా రైతుల ఆత్మహత్యల కింద చేర్చుతున్నారని విమర్శించారు.
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, రైతులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని కోరుతున్నామని బాల్కసుమన్ విజ్ఞప్తి చేశారు. బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా నామినేటెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించడం గొప్ప నిర్ణయం అని అన్నారు. కాకా(కే వెంకటస్వామి) విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాల్క సుమన్ చెప్పారు.