mt_logo

కుడితిలో పడ్డ మోత్కుపల్లి

మనుషులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబును మించినోడు ఈ భూపెపంచకంలోనే లేడని తెలవనోడు అసలీ భూపెపంచకంలోనే లేడు. ఓటర్లయినా, నాయకులైనా మనోడిది ఒకటే పాలసీ. ఏరు దాటే దాక ఓడ మల్లయ్య, ఏరు దాటాక బోడ మల్లయ్య.

తెలుదుదేశం పార్టీని స్థాపించి, తనకు రాజకీయ భిక్ష పెట్టిన స్వంత మామ ఎన్.టి.ఆర్ తో మొదలైన ఈ వెన్నుపోట్ల పర్వం, నేటికీ అప్రతిహతంగా సాగుతూనే ఉంది. చంద్రబాబు దెబ్బకు గుండెపగిలి ఎన్.టీ.ఆర్. మరణిస్తే, మరీ ఆ రేంజ్ లో కాకపోయినా ఆయన దెబ్బకు తట్టుకోలేక గింగిరాలు తిరిగిపడిపోయినవారు కోకొల్లలు.

హరికృష్ణ, జూనియర్ ఎన్.టీ.ఆర్, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, మోహన్ బాబు, రేణుకా చౌదరి మొదలు ఆయన నమ్మించి నట్టేట ముంచిన నాయకులెందరో పార్టీనొదిలి వేరే పార్టీల్లో స్థిరపడిపోయారు.

వెల్లంపల్లి అవినాష్ అనే మిత్రుడు ఇదే మిషన్ తెలంగాణలో చంద్రబాబునాయుడు వైఖరిపై ఏమన్నాడో ఒకసారి చదవండి.

“ఎప్పుడో పక్కన పారేసిన హరికృష్ణనీ, బాలకృష్ణనీ మళ్లీ దగ్గరికి తెచ్చుకున్నడు. తాజా కరివేపాకు పాత్ర పోషించడానికి జూ. ఎన్టీఆర్ నీ తెచ్చుకున్నడు. కొద్ది రోజులు వాడుకుని, బాలకృష్ణని మాత్రం అట్టే పెట్టుకుని హరికృష్ణకీ, జూ. ఎన్టీఆర్ కీ తాత్కాలికంగా కరివేపాకు గతి పట్టించిండు.

పార్టీలో దేవేందర్ గౌడ్ రెండో స్థానానికి ఎదుగుతున్నడని భయపడి, నాగం జనార్ధన్ రెడ్డిని ఎగదోసి దేవేందర్ గౌడ్ ని వెళ్లగొట్టిండు. నాగం జనార్ధన్ రెడ్డిని వెళ్లగొట్టడానికి ఎర్రబెల్లిని వాడుకున్నడు. రేపు ఎర్రబెల్లిని వెళ్లగొట్టడానికి మోత్కుపల్లి నర్సింహులుని వాడుతున్నడు. ఎల్లుండి మోత్కుపల్లిని వెళ్లగొట్టడానికి ఇంకో తోకనెవరినో వాడుతడు.”

పార్టీ కోసం ఎంతో పాటుపడ్డా రాజ్యసభ సీటు ఇవ్వకపోతే తెదేపా నేత అరవింద్ కుమార్ గౌడ్ బహిరంగంగానే చంద్రబాబుది ‘వాడుకుని వదిలేసే రకమని’ ధ్వజమెత్తాడు. తన స్వంత మామ అయిన దేవేందర్ గౌడ్ పార్టీని వదిలివెళ్లినప్పుడు చంద్రబాబు తనను తన మామ మీదికే ఉసిగొల్పాడని. అందుకు ప్రతిఫలంగా రాజ్యసభ ఇస్తానని అన్నాడని, కానీ తీరా అవసరం తీరాక తనను పట్టించుకోవడమే మానేశాడని అరవింద్ మీడియా ముందు వాపోయాడు.

గత కొంతకాలంగా తెలంగాణ ఉద్యమ నాయకత్వాన్ని అడ్డగోలుగా తిడుతున్న మోత్కుపల్లి నరసింహులు ఇప్పుడు నాయుడు పాలసీ లేటెస్టు బాధితుడు.  అర్థం పర్థం లేకుండా ఉద్యమంపై విరుచుకుపడుతున్న రోజుల్లో మోత్కుపల్లికి కూడా అనేకమంది శ్రేయోభిలాషులు ‘చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట ముంచుతాడని’ హితవు పలికారు. కానీ ఆయన ఆ హితోక్తులు ఏవీ చెవికెక్కించుకోలేదు.

ఫలితం, ఇప్పుడు చంద్రబాబు తననే పక్కనపెట్టాడని మీడియా ముందు భోరుమనే పరిస్థితి వచ్చింది మోత్కుపల్లికి. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ “తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పద్ధతి లేకుండాపోయిందని, బ్లాక్‌మెయిల్ చేసిన వారి మాటలే ఆయన వింటున్నారని, పార్టీకోసం పనిచేసిన వారిని పట్టించుకోవడంలేదు” అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

తెలంగాణపై అఖిలపక్షం ముందు జరిగిన అంతర్గత చర్చలకు మోత్కుపల్లి నరసింహులును బాబు పిలవలేదు. డిల్లీలో జరిగిన అఖిలపక్షానికి కూడా మోత్కుపల్లిని పంపలేదు. దీంతో కినిసిన ఆయన గత కొన్ని వారాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నాడు.

మబ్బులో నీళ్ళను చూసి ముంతలో నీళ్లు ఒలకబోసుకున్నట్టు అయ్యింది ఇప్పుడు మోత్కుపల్లి పరిస్థితి. ఒకవైపు స్వంత నియోజకవర్గం తుంగతుర్తిలో పోటీచేస్తే డిపాజిట్ కూడా దక్కని స్థితి. పోనీ హైదరాబాదులో సురక్షిత సీట్ ఏదైనా దక్కించుకుందామంటే ఇప్పుడు అధినేతతో చెడిన వ్యవహారం. సీమాంధ్ర మీడియా ఎక్కించిన మునగచెట్టునుండి కిందపడ్డనాడు తనను పట్టించుకునే వారెవరూ ఉండరని ఆయనకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతున్నది.

సో! రెంటికీ చెడ్డ మోత్కుపల్లి ఇప్పుడేం చేస్తాడో వేచి చూడాల్సిందే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *