తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలో జరపాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. డిల్లీలో ఎర్రకోటలో జరిగేవిధంగా ఇక్కడ కూడా ఉత్సవాలు జరపాలని, రాబోయే రోజుల్లో కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గోల్కొండ కోటలోనే జరపాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ విషయమై అన్నివిధాలుగా పరిశీలించాలని, తెలంగాణ చరిత్ర, సంస్కృతి, వైభవాలను చాటేలా శకటాలను ప్రదర్శించాల్సిందిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు.
సీఎం ఆదేశం మేరకు ప్రభుత్వ కార్యదర్శి రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సోమవారం గోల్కొండ కోటను సందర్శించి పరిశీలించనున్నారు. ఆరు దశాబ్దాల పోరాటం తర్వాత కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఈసారి పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరపాలని, తెలంగాణకు పట్టుకొమ్మలైన కాకతీయ తోరణం, పేరిణి శివతాండవం, ఒగ్గుకథ, గిరిజనుల గుసాడి నృత్యం, జానపద నృత్యాలు శకటాల్లో ప్రదర్శించాలని సీఎం కేసీఆర్ సూచించారు.
పోతన, వట్టికోట ఆళ్వార్ స్వామి, దాశరథి రంగాచార్య వంటి తెలంగాణ వైతాళికులు, సుప్రసిద్ధ రచయితల చిత్రపటాలను కూడా ప్రదర్శించనున్నారు. తెలంగాణ పండుగలైన బతుకమ్మ, బోనాలు, పీర్ల పండుగల శకటాలను, ఐటీ పరిశ్రమ, రింగురోడ్డు, పరిశ్రమల చిత్రాలు ఈ సందర్భంగా ప్రజలకు దర్శనమివ్వనున్నాయి. స్వాతంత్ర్య వేడుకలకు సంబంధించి సలహాలు, సూచనలు ఇవ్వాలని మేధావులను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కోరారు. మొత్తమ్మీద గోల్కొండ కోటలో జరిగే ఈ వేడుకలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.