mt_logo

శల్యులెవరు? యుయుత్సులెవరు? ఎవరి పుట్టలు? ఎవరు పాములు?

By: -శరత్ చంద్ర

యుద్ధంలో నీతి ఉండదు. ఎన్నికలు కూడా యుద్ధమే. గెలవడమే ముఖ్యం. ధర్మమా అధర్మమా అన్నది అప్రస్తుతం. సీమాంధ్ర పార్టీలు ఈ విద్యలో బాగా ఆరితేరాయి. వారికి యాభైయేళ్ల అనుభవం ఉంది. లక్షలకోట్ల పెట్టుబడులు ఉన్నాయి. కోరుకున్నది రాసిపెట్టే పత్రికలున్నాయి. అంకితభావంతో పనిచేసే అరడజను చానెళ్లు ఉన్నాయి. సీమాంధ్ర నాయకులు ఎంత గడసరులంటే పార్టీ మారకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వగలరు. పార్టీ మారేందుకూ డబ్బులు ఇవ్వగలరు. కూలుతున్న తెలుగుదేశం కోటలను కాపాడుకోవడానికి, జారిపోతున్న సైన్యాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు దేనికైనా తెగిస్తారని అనేక సందర్భాలు రుజువు చేశాయి. ఇప్పుడూ అదేపని చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఇంతకాలం బ్లాక్ షీప్స్‌గా పనిచేస్తున్న వారిని టోకుగా కొనుగోలు చేసే కార్యక్రమం మొదలయింది. టీఆరెస్ కూడా ఇటువంటివారిని ఇప్పుడే వదిలించుకోవడం మంచిది. కురుక్షేత్రం ప్రారంభానికి ముందు సేనలు ఎదురెదురు నిలబడి ఉన్నసమయంలో ధర్మరాజు ఇరు సేనలనుద్దేశించి, ‘ఇది ధర్మయుద్ధం. మీలో ఎవరైనా ఇటువైపు వారు అటుగానీ అటువైపువారు ఇటుగానీ మారదల్చుకుంటే తేల్చుకొండి’ అని అంటారు. కౌరవుల్లో ఒకరైన యుయుత్సుడు పాండవ సేనవైపు వస్తాడు. యుద్ధ రంగంలో పాండవుల పక్షాన ఏడు అక్షౌహిణిల సేన నిలబడితే, కౌరవుల పక్షాన 11 అక్షౌహిణిల సేన నిలబడింది.

పాండవులు అడవి నుంచి వచ్చి యుద్ధానికి ఇంతమందిని సమీకరించుకోగలిగారు. కురురాజు దుర్యోధనుడు అన్ని రకాల తాయిలాలు ప్రయోగించి అనేక దేశాల రాజులను లోబర్చుకున్నాడు. పాండవుల మేనమామ శల్యుడిని కూడా దారిలోనే అడ్డగించి ఆయనకు మధుపానీయాలు, సకల సత్కారాలు, సంపదలు ఎరచూపి తమవైపు తిప్పుకున్నాడు దుర్యోధనుడు. అలాగే ఇప్పుడు తెలంగాణలో జరుగుతోంది. టీఆరెస్ వైపు వచ్చేవాళ్లు తెలంగాణకోసమో, తెలంగాణపేరుతో గెలవడం కోసమో వస్తున్నారు. వాళ్లు ఎలా వచ్చినా తెలంగాణపక్షం వస్తున్నారు. ఇతరపార్టీలలోకి వెళ్లేవారు గెలిచినా గెలవకపోయినా నాలుగు రాళ్లు వెనుకేసుకోవడం కోసం, తెలంగాణ ఉద్యమంమీద వందరాళ్లు విసరడంకోసం వెళుతున్నారు. తెలంగాణ ఉద్యమం వందలు వేల మంది నాయకులను తయారు చేసింది. వారంతా తెలంగాణకోసమే ఉద్యమంలోకి వచ్చినా అంతిమంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదవి ఆశించడం సహజం. కానీ అవకాశం రాకపోతే తెలంగాణకోసం ఓపికపట్టడమూ అంతే అవసరం. సీమాంధ్ర పార్టీల ఎత్తులకు చిక్కితే చిక్కినవారికి ఏమీ దక్కకపోగా తెలంగాణవాదానికి కూడా చెరుపు చేసినవారవుతారు.

ఎన్నికలు సమీపించే కొద్దీ తెలంగాణవాదంపై ఈ దాడి ఇంకా పెరుగుతుంది. తెలంగాణవాదులతోనే తెలంగాణవాదుల కళ్లు పొడిపించే ప్రయత్నాలు జరుగుతాయి. అసత్య ప్రచారాలు, అధర్మయుద్ధాలు చాలా చూస్తాం. పన్నెండేళ్లుగా ఏ అధికారమూ లేకుండా ఉద్యమాన్ని, పార్టీని నడిపిస్తున్న నేతపై ఎన్ని అడ్డగోలు ఆరోపణలయినా చేయిస్తారు. అన్ని చానెళ్లు నిరవధికంగా లైవ్‌లు నిర్వహిస్తాయి. వారి ఆరోపణలను పత్రికలు పతాక శీర్షికల్లో ప్రకటిస్తాయి. ఇందుకు తెలంగాణ సమాజం సిద్ధపడవలసిందే. ఇటువంటి రక్తపాతాలు ఇంకా చాలా చూడవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలు తెలంగాణవాదానికి, తెలంగాణ వ్యతిరేకులకు మధ్య జరుగబోతున్నాయి. టీఆరెస్‌కు, సీమాంధ్ర పార్టీలకు మధ్య జరుగబోతున్నాయి. తెలంగాణ అస్తిత్వ కాంక్షకు, సీమాంధ్ర రాజ్యబలానికి, ధనబలానికి మధ్య జరుగబోతున్నాయి. ఇప్పుడు తటస్థంగా ఉండడం అసాధ్యం. మనం ఎవరి పక్షమో నిర్ణయించుకోవాలి.

సీమాంధ్ర నీతి

కుటుంబ రాజకీయాలు సీమాంధ్ర పార్టీలు చేయవచ్చు, ఆ పార్టీలలో తెలంగాణ ద్రోహులు మునిగితేలనూ వచ్చు. కానీ టీఆరెస్‌లో మాత్రం కుటుంబం ఉండరాదట!

సీమాంధ్ర పార్టీలు వందల కోట్ల రూపాలయను ఎన్నికల నిధులుగా సమీకరించుకోవచ్చు. పొలిట్‌బ్యూరోను పారిశ్రామికవేత్తలతో నింపవచ్చు. ఎన్నికల్లో పెట్టుబడులు పెట్టిన పారిశ్రామిక వేత్తలకు రాజ్యసభ టికెట్లు ఇవ్వచ్చు. కానీ టీఆరెస్ ఎన్నికల నిధులు వసూలు చేయడం నేరం! తెలంగాణవాడికి గోచీ ఉండడం కూడా నేరమే!

సీమాంధ్ర పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తీర్మానాలు చేయవచ్చు, తీరా తెలంగాణా వచ్చిన తర్వాత అడ్డం తిరిగి అడ్డగోలుగా మాట్లాడొచ్చు, తెలంగాణకు వ్యతిరేకంగా ఢిల్లీలో గల్లీలో అనేక కుట్రలు చేయవచ్చు, మూడేళ్లలో వెయ్యి మంది తెలంగాణ యువకులను బలితీసుకోవచ్చు, కానీ ఆ నేరం మాత్రం టీఆరెస్‌పై మోపాలట!

తెలంగాణ సాధనకోసం ఉద్యమాలు చేయరట. కనీసం తీర్మానాలు కూడా చేయరట. తెలంగాణ ఎందుకివ్వలేదని కూడా అడగరట. పిల్లలు చనిపోతున్నా చలించరట. కానీ ఆ పార్టీలకు తెలంగాణ ప్రజలు ఓట్లెయ్యాలట!!

చంద్రబాబు తెలంగాణ గురించి తప్ప దేశంలోని సమస్యలన్నీ మాట్లాడతాడు. జగనన్న తెలంగాణ గురించి తప్ప రాజన్న రాజ్యం గురించి మాట్లాడతాడు. కిరణన్న ఇందిరమ్మకలలు, బంగారుతల్లి గురించి తప్ప తెలంగాణ మాటెత్తడు. తెలంగాణ గురించి మాట్లాడని వీరందరికంటే, తెలంగాణకోసం కొట్లాడే కేసీఆరే వీళ్లకు శత్రువట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *