– శ్రీకాంత్ కాంటేకర్
తెలంగాణ అంటే ఒక మహత్తర నినాదంగా ప్రతి గుండె ఉప్పొంగుతుంది. జై తెలంగాణ అన్న కేకకు నరనరాల్లో రక్తం ఉడుకుతుంది. రొమాలు నిక్కబొడుచుకుంటాయ్! అది ముమ్మాటికీ పది జిల్లాల తెలంగాణ! ఒక అస్తిత్వాన్ని రూపు కట్టుకొని చరిత్ర నిండా నెత్తురు చిందిస్తూ..అనేక తండ్లాటలు, యాతనలు, ఆరాటాలతో పోరాడిన గడ్డ. అనునిత్యం క్షోభ అనుభవించి.. అరవై యేండ్ల సంది మర్లబడ్డ పోరుక్షేత్రం. స్వరాష్ట్రం కోసం.. స్వపరిపాలన కోసం వేలాది ప్రాణాలు బలిదానాలు చేసి.. ఎన్నో త్యాగాలు చేసి.. కత్తుల వంతెనపై.. ఖాకీల ముళ్లవనంపై, రాజ్యం దమనకాండపై కవాత్తు చేసి.. ఎదిరించి నిలిచిన గడ్డ.. అది ముమ్మాటికీ పది జిల్లాల తెలంగాణే. అందుకే తెలంగాణ అంటే ఈ మట్టిని ప్రేమించి ప్రతి ఒక్కరి గుండె ఉప్పొంగుతుంది. రక్తం ఉడుకుతుంది. ఆ నినాదం వింటే పోరాటానికి వెనుకడుగేయని గుండె ధైర్యం పొడుచుకొస్తుంది. పొడుస్తున్న పొద్దు మీద ఎదురీదుతున్న పోరుగీతంలా ఉంటుంది. తెలంగాణ. అది పది జిల్లాల తెలంగాణ!
మరి ఇంతటి అస్తిత్వం, ప్రత్యేకత, పోరాటం నిండిన తెలంగాణకు మరో రెండు జిల్లాలు తగిలించి.. రాయల తెలంగాణ అంటే ఎంత మండుతోంది. ఎంత రెషం పొడుచుకొస్తుంది. పోరాటం ఎవడిది. ఆరాటం ఎవడిది. ఫలితం ఎవడికి.. తెలంగాణ అస్తిత్వాన్నే కలుషితం చేసేలా ఈ రాయల తెలంగాణ ప్రతిపాదన ఎందుకు. అందుకే యావత్ తెలంగాణ ఒక్కతీరుగా రగిలిపోతుంది. మళ్లీ యుద్ధం తప్పదని ముక్తకంఠంతో నినదిస్తుంది..
నిజానికి తెలుగువారి పేరిట ఒకే గాటన కట్టినా తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర అంటే వేటికవి ప్రత్యేక అస్తిత్వమున్న ప్రాంతాలు. భాష, కట్టుబొట్టు, సంస్కృతిక వైరుధ్యాలు సుస్ఫష్టం. ఎంత తెలుగుజాతి అయినా, ఎంత భారత జాతి అయినా తమ అస్తిత్వాన్ని, మూల, ఆదిమ వారసత్వాన్ని చంపుకొని.. ఏకీకరణ అయి గుంపులో గోవిందంలా ఉండమంటే ఎవరూ ఒప్పుకోరు. మరి రాయలసీమ అస్తిత్వాన్ని చెరిపి.. ధ్వంసం చేసి… చరిత్రలో రాయలసీమ కనబడకుండా, వినబడకుండా చేయజూస్తున్న ఈ రాయల ప్రతిపాదనకు ఆ ప్రాంతం నేతలు ఎలా సై అంటున్నారో అర్థం కాని విషయం!
సమైక్యాంధ్ర ఉద్యమం మళ్లీ ఎగిసిపడకుండా కాంగ్రెస్ గేమ్ ప్లాన్ లో భాగంగా రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చినట్టు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదన వెనుక తీవ్ర రాజకీయ కారణాలు సుస్ఫష్టం. వెయ్యికి పైగా బలిదానాలు, అంతకుమించి సాగిన పోరాటాలు గుర్తించినప్పటికీ కాంగ్రెస్ నిజాయితీగా తెలంగాణ ఇస్తోందని నిజమైన తెలంగాణవాది భావించడం లేదు. ఒక అనివార్యత, రాజకీయ కోణం.. తెలంగాణ ఆకాంక్ష, ఉవ్వెత్తున సాగిన పోరాటాన్ని గుర్తించక తప్పని పరిస్థితిని కల్పించాయి. అలాంటప్పుడు దశాబ్దాలు ధోకా చేస్తూ.. తెలంగాణను మోసగిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ చివరికీ రాయల అంటూ ఇంకా చావు తెలివితేటలు ప్రదర్శించడం, దొంగ నాటకాలు వేయడం దేనికి? ఈ దారుణమైన చర్యే తెలంగాణవాదుల పుండుపై కారం చల్లినట్టు ఉంది. అరవై ఏళ్లుగా చేసిన గాయనికి మాలం పూయాల్సిందిపోయి.. కొత్త గాయాన్ని చేయాలని కాంగ్రెస్ భావిస్తుండటమే దారుణాతిదారుణం. తన రాజకీయపబ్బం కోసం ఇటు తెలంగాణను, అటు రాయలసీమను వంచించి.. ప్రాంతీయ అస్తిత్వాలనే చెరిపేవిధంగా కుట్ర చేస్తున్న కాంగ్రెస్ మళ్లీ తెలంగాణ ఉద్యమ రుచి చవిచూడక తప్పదు. ఇక యుద్ధం తప్పదు. రాయల కొర్రీలు పెడితే.. కాంగ్రెస్ ను పాతాళంలోకి తొక్కేయక తప్పదు. ఇప్పటికైనా మేలుకొనే విజ్ఞత టీ కాంగ్రెస్ నేతలకు ఉందా?