mt_logo

10 రోజులు కాదు.. 20 రోజులైనా చర్చకు రెడీ!

వర్షాకాల శాసనసభా సమావేశాల్లో తొలి రెండురోజులు రైతు సమస్యలపై సమగ్ర చర్చ జరుపుదామని, అవసరమైతే మరో రోజు కూడా పొడిగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బుధవారం శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈనెల 29 నుండి అక్టోబర్ 10 వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను నిర్వహించాలని సమావేశం నిర్ణయం తీసుకుంది. ఈ సమవేశంలో అధికార పార్టీ టీఆర్ఎస్ పలు కీలక ప్రతిపాదనలు చేసింది. రైతు సమస్యలతో పాటు అన్ని అంశాలపై చర్చ జరగాలని, రుణమాఫీ, విద్యుత్ సరఫరాపై కూడా చర్చించాలని అన్ని రాజకీయ పార్టీల నేతలు తీర్మానించారు.

బీసీ సబ్ ప్లాన్, గృహ నిర్మాణం, సంక్షేమం, స్వైన్ ఫ్లూ, గిరిజన సంక్షేమం, విషజ్వరాలు, యూనివర్సిటీల్లోని సమస్యలపై చర్చ జరగాలని విపక్షాలు ప్రతిపాదించగా, పది రోజులు కాదు.. అవసరమైతే 20 రోజులపాటు చర్చలు జరపడానికి తమకు అభ్యంతరం లేదని సీఎం కేసీఆర్ ప్రకటించారు. విపక్షాలు పది రోజులపాటు సభను నడపాలని కోరగా 20 రోజులైనా తాము చర్చకు సిద్దమేనని అధికార పార్టీ తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ ఈనెల 29, 30 తేదీల్లో రైతు సమస్యలపై సమగ్ర చర్చ జరపడానికి సర్కార్ సిద్ధంగా ఉందని, ప్రశ్నోత్తరాల సమయం లేకుండా నేరుగా రైతు సమస్యలపై చర్చ జరగాలని సూచించారు. మధ్యాహ్నం వరకు చర్చ సరిపోదనుకుంటే రెండు పూటలు సభను జరుపుదామని సీఎం కేసీఆర్ ప్రతిపాదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *