నాలుగోరోజు అసెంబ్లీ సమావేశాలు మొదలవ్వగానే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని స్పీకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ బలహీన వర్గాలకు నిలయమని, బలహీనవర్గాల క్షేమమే తమ ధ్యేయమని, నిరుపేద వర్గాలను ఆడుకోవడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి పథకం ప్రవేశపెట్టామని, మైనార్టీల సంక్షేమం కోసం రూ. 1030 కోట్లు కేటాయించామని చెప్పారు. స్వయం ఉపాధిని పకడ్బందీగా అమలు చేస్తామని, ఎస్సీ, ఎస్టీలకు 60 శాతం సబ్సిడీతో మొత్తం ఒక లక్ష రూపాయలు, అదేవిధంగా బీసీ, మైనార్టీలకు 50 శాతం సబ్సిడీతో రూ. లక్ష అందజేస్తున్నట్లు ఈటెల పేర్కొన్నారు.
బంగారు తెలంగాణ కోసమే సమగ్రసర్వే చేసామని, తెలంగాణ ప్రాంతంలో ఆర్ధిక స్థితిగతులు, సామాజిక, వైద్య, విద్యతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించడానికే సర్వే చేపట్టామని మంత్రి ఈటెల తెలిపారు. జనాభా కంటే రేషన్ కార్డులు ఎక్కువగా ఉన్నాయని, కార్డుల విషయంలో అవకతవకలు జరిగాయని, ఒక్కొక్కరికీ రెండు రేషన్ కార్డులు, రెండు ఓటర్ కార్డులు ఉన్నాయని చెప్పారు. అన్నిటినీ సరిచేయాలనే ఉద్దేశంతోనే సర్వే జరిపామని, ప్రజా సంక్షేమం కోసమే సర్వే చేశామని, నిజమైన లబ్ధిదారులకు మాత్రమే సంక్షేమ పథకాలు వర్తిస్తాయని ఈటెల తెలిపారు.
సర్వేను ప్రధాని మోడీ సైతం ప్రశంసిస్తే ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వే నిరంతర ప్రక్రియ అని, సర్వేలో పాల్గొనని వారికి మళ్ళీ సర్వే ఉంటుందని, సర్వే చేయడం వల్ల అన్ని వర్గాల జనాభా ఖచ్చితంగా తెలుస్తుందన్నారు. అనంతరం శాసనసభను స్పీకర్ 10 నిమిషాల పాటు టీబ్రేక్ కోసం వాయిదా వేశారు.