ఈరోజు ఉదయం తెలంగాణ రాష్ట్ర శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. సొంతరాష్ట్రం, సొంత పాలనతో అసెంబ్లీలో ఉన్నామని, ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తామని, దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ప్రజలందరూ సాధించిన విజయమని, తెలంగాణ సాధనలో టీఆర్ఎస్ పార్టీ అగ్రభాగాన నిలిచిందని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రభుత్వానికి సహకరిస్తామని, పరస్పర విమర్శలు మాని తెలంగాణను అభివృద్ధి చేసి చూపిద్దామని పేర్కొన్నారు.
అనంతరం కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను ప్రభుత్వం సమర్ధవంతంగా అమలుచేయాలన్నారు. అమరుల త్యాగాలను మనం గుర్తుచేసుకోవాలని, అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలని సూచించారు. గిరిజనులకు ప్రభుత్వం కల్పిస్తామన్న 12శాతం రిజర్వేషన్లను స్వాగతిస్తున్నామని గీతారెడ్డి చెప్పారు.