mt_logo

రెండవరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ తొలి శాసనసభ సమావేశాలు రెండవరోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ గా మధుసూదనాచారి ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ జానారెడ్డి అధికారికంగా ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మాట్లాడుతూ తెలంగాణ తొలి శాసనసభాపతి ఎన్నిక చారిత్రాత్మకమైనదని, మరువలేని సంఘటన అని ఆనందం వ్యక్తం చేశారు. స్వరాష్ట్రంలో మొట్టమొదటి శాసనసభ స్పీకర్ గా తెలంగాణ ఉద్యమకారుడు పదవీబాధ్యతలు చేపట్టడం, తొలి సభ తెలంగాణ ఉద్యమకారులచే కొలువు తీరడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆయన ఉద్వేగభరితంగా మాట్లాడారు.

పట్టుదలకు మారుపేరు మధుసూదనాచారి అని, తెలంగాణ ఉద్యమంలో చారి సేవలు మరువలేనివని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇన్నేళ్ళ తెలంగాణ కలను సాకారం చేసుకుని సభ కొలువుదీరింది. ఇదే సభలో జై తెలంగాణ అన్న పదం నిషేధించిన సంఘటన నేను మర్చిపోలేను. ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా సభ కొనసాగాలి. ఈ సభను చూస్తుంటే నాకు ఆనందభాష్పాలు వస్తున్నాయి. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమకారులే సభను నడపడం సంతోషంగా ఉంది. దేశంలోనే తెలంగాణ శాసనసభ గొప్ప పేరు తేవాలి అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు.

శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించిన మధుసూదనాచారిని అన్ని పార్టీలకు చెందిన పలువురు నేతలు ప్రశంసించారు. సభ మంచి సంప్రదాయాలతో నడవాలని, స్పీకర్ చారిత్రాత్మక పాత్ర పోషించాలని, నిష్పక్షపాతంగా వ్యవహరించి ప్రజల సమస్యలపై అర్ధవంతమైన చర్చ జరిగేలా చూడాలని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సభ నూతన ఒరవడి సృష్టించాలని, సభ్యులకు సమస్యలపైనే కోపం ఉండాలని, ప్రజాసమస్యల పరిష్కారానికి సభ్యులందరూ సహకరించాలని జానారెడ్డి కోరారు.

ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ మధుసూదనాచారి స్పీకర్ గా ఎన్నికవడం మాకందరికీ గర్వకారణం అని, ఆయన తనకు రాజకీయ పాఠాలు నేర్పిన విషయం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, టీ టీడీపీ నేతలు ఎర్రబెల్లి, రేవంత్ రెడ్డి, తలసాని కూడా మధుసూదనాచారిని అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *