శుక్రవారం తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలు ఏ విషయాన్ని లేవనెత్తిన సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలదే కీలకపాత్ర అని చెప్పారని తెలిసింది. మంత్రులుగానీ, ఇతరులుగానీ అందులో జోక్యం చేసుకోరని, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమన్వయంతో ముందుకు వెళ్ళాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం.
ఏపీ ప్రభుత్వ కుట్రలవల్లే రాష్ట్రంలో విద్యుత్ సమస్య నెలకొన్నదని, రోజుకు వెయ్యి మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని, మూడేళ్ళలో కరెంట్ మిగులు రాష్ట్రంగా ఉండేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కానీ ప్రతిపక్షాలు ఈ విషయంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, దీనిని సమర్ధవంతంగా తిప్పికొట్టాలని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పించన్, రేషన్ కార్డ్ ఇస్తామని, ఇందులో ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు.
వచ్చేనెల 5 నుండి 23 వరకు శాసనసభ సమావేశాలు ప్రారంభం అవుతాయని, బడ్జెట్ సమావేశాల సందర్భంగా అందరూ నియోజకవర్గాల సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద సంవత్సరానికి ఎమ్మెల్యేకు రూ. 50 లక్షలు ఖర్చు చేసేవారని, ఇకనుండి ఒక్కో నియోజకవర్గానికి రూ. 1.50 కోట్లను నియోజకవర్గ అభివృద్ధికై ఇస్తామని సీఎం చెప్పారు.