జూన్ 9, సోమవారం నుండి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని నీటిపారుదల, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి టీ హరీష్ రావు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రొటెం స్పీకర్ గా జానారెడ్డి ప్రమాణస్వీకారం చేస్తారని, 11.30 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే కొత్త సభ్యులు ప్రమాణస్వీకారం చేస్తారని వివరించారు. మరుసటి రోజైన 10వ తేదీనాడు స్పీకర్ ను ఎన్నుకుంటామని, అన్ని పార్టీల నిర్ణయంతోనే స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలకు కార్యాలయాలను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని, అసెంబ్లీలో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
మరోవైపు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టీ రాజయ్య సచివాలయంలోని డీ బ్లాకులో ఉన్న తన ఛాంబర్ లో ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగసంఘాలు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పడకలను 50 నుండి 120 కు పెంచుతూ ఉపముఖ్యమంత్రి రాజయ్య మొదటి సంతకం చేశారు. మెదక్ జిల్లా నంగునూరులో కూడా 50 పడకల ఆస్పత్రిని మంజూరు చేశారు. వైద్యరంగంలో అవినీతికి ఆస్కారం లేకుండా చూస్తామని, వైద్య విద్యను ప్రోత్సహిస్తామని, త్వరలో అన్ని ఆస్పత్రుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని తెలిపారు.