mt_logo

అసెంబ్లీలో అరెస్టుల పర్వం!

సీమాంధ్ర నాయకులు అడుగడుగునా అడ్డుపడడంతో గురువారం కూడా అసెంబ్లీ వాయిదా పడింది. వారి కుట్రల ఫలితంగా శాసనసభ ౩ నిమిషాల్లోనే ముగియడంతో తెలంగాణ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం ఏకపక్షంగా వాయిదా నిర్ణయం తీసుకోవడాన్ని టీ నేతలు తప్పుబట్టి దాదాపు 8 గంటలపాటు నిరసనకు దిగారు. సభను వదిలి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పి సభలోనే బైఠాయించారు. రాత్రి 10గంటల సమయంలో నిరసన చేస్తున్న టీ ఎమ్మెల్యేలను పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి వారి పార్టీల కార్యాలయాల దగ్గర విడిచిపెట్టారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలు భోజనం చేస్తున్నారని కూడా చూడకుండా అతి దారుణంగా అరెస్టు చేయడంపై టీ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు రోజులపాటు సభలో చర్చ జరగాలని బీఏసీ తీర్మానించినా, సీమాంధ్ర ఎమ్మెల్యేలు సభను జరక్కుండా అడ్డుపడి ఏకపక్షంగా వాయిదా వేసేలా చేశారని అన్నారు. జనవరి ౩కు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సభలో చెప్పగానే టీ ఎమ్మెల్యేలు అందరూ గట్టిగా వ్యతిరేకించారు. అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం వచ్చి నిరసన విరమించమని చెప్పినా సభ జరిగేదాకా తాము సభలోనే ఉంటామని, బయటకు వచ్చే ప్రసక్తే లేదని చెప్పడంతో పోలీసులు వచ్చి టీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలను బలవంతంగా అరెస్టు చేసి అక్కడినుండి పంపించివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *