ఆంధ్రోద్యమంలో అరవలను మీరు తిట్టిపోయలేదా?

  • December 20, 2012 11:28 am

By: కొణతం దిలీప్

“మేం తెలంగాణకు వ్యతిరేకం కాదు. కానీ ఉద్యమంలో భాగంగా ఆంధ్రోళ్లను మీరు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నరు. మమ్మల్ని దోపిడీదార్లని అంటున్నరు. ఇట్లా తిడుతున్నరు కాబట్టే రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం అవుతున్నది”. అని ఇటీవల అన్నాడో సీమాంధ్ర మిత్రుడు.

అంతటితో ఆగక “ఇంత ద్వేషభావంతో విడిపోయిన తెలంగాణ అసలు ఏమవుతుంది?, ఇక్కడున్న సీమాంధ్రుల పరిస్థితి ఏమవుతుంది?” అని కూడా వాపోయాడు.

ఈ ప్రశ్నకు కూడా మేం చాలాసార్లే జవాబిచ్చినం. కానీ ఇదే ప్రశ్న మల్ల మల్ల అడుగుతున్నరు కాబట్టి. ఇంకోసారి…

ఇవ్వాళ తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలని ఉద్యమిస్తున్నదే ఉమ్మడి రాష్ట్రంలో వారి ప్రయోజనాలు దెబ్బతిన్నాయని. వారి వనరులు, ఉపాధి అవకాశాలు కొల్లగొట్టబడ్డాయని. కాబట్టి వారికి సహజంగానే ఈ పరిస్థితికి కారణమైన సీమాంధ్ర ప్రాంతంవారిపై ఆగ్రహం ఉంటుంది.

అయితే ఉద్యమం సాగుతున్నప్పుడు ఉండే ఆగ్రహ భావనలు తెలంగాణ ఏర్పాటు తరువాత ఉండవు. దీనికి ఆంధ్ర-మద్రాసు రాష్ట్రాల విభజన సందర్బంగా జరిగిన చరిత్రను కొంచెం గుర్తుకు చేయాలె మీకు.

విద్య, ఉద్యోగాలు, వనరుల్లో తమిళులే ఆధిపత్యం చలాయిస్తున్నారని, ఆంధ్రులకు అన్యాయం జరుగుతుందనే కారణంగా మదరాసు నుండి ఆంధ్ర రాష్ట్రం విడదీయాలనే ఉద్యమం ఊపందుకున్నది. ఈ ఉద్యమం చాలా యేళ్లు కొనసాగి చివరి దశలో తమిళులు, ఆంధ్రుల మధ్య ద్వేషభావాలు తారాస్థాయికి చేరాయి.

ఒకరిపై ఒకరు చేసుకునే ఈ ప్రచారంలో చివరికి చిన్న పిల్లల కథల పుస్తకాల్లో కూడా అరవల (తమిళుల) మీద వ్యాఖ్యలు ఉండేవి. మచ్చుకు 1948 నాటి “బాల” పత్రికలో ఈ కథ చూడండి:

 

 

అరవల కన్నా ఆంధ్రులు గొప్ప అని ఇట్లాంటి కథలు రాసి చిన్నపిల్లల మెదళ్లలో నింపడం అవసరమా? ఒకసారి అలోచించండి.

ఇక ఆ కాలంలో ఆంధ్రులు చలామణిలోకి తెచ్చిన కొన్ని సామెతలు చూడండి. అవి అరవల పట్ల ఎంతటి ఏహ్యభావం ప్రదర్శిస్తున్నవో:

“అరవల పొట్ట, తమలపాకుల కట్ట ఎప్పుడూ తడుపుతూనే ఉండాల”
“అరవ చాకిరి మంగలి  అందరికీ దొరకడు”
“అరవ చెవులకేల అరిది వజ్రపు కమ్మలు”
“అరవ చెరుచు, పాము కరచు”
“అరవ అత్తగారు, ప్రధమశాఖ మామగారు”
“అరవ అధ్వాన్నం, తెనుగుతేట, కన్నడం కస్తూరి”

 

ఇంతటితో ఆగలేదు మన ఆంధ్ర సోదరులు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా ఆంధ్ర మహాసభ తమిళులకు వ్యతిరేకంగా ఆంధ్రులకు ఒక పిలుపు ఇచ్చింది.

“తిరుపతి వెంకటేశ్వర స్వామి తమిళ దేవుడు. ఆంధ్రులు ఆ దేవాలయమును బహిష్కరించవలయును” (N. Subba Rao, History of Andhra Movement, Andhra Region, Vol-II, Hyderabad, 1982)

దేవుళ్లకు కూడ ప్రాంతీయత ఆపాదించిన గొప్ప చరిత్ర సీమాంధ్రులదే.

ఇంత ఘోరంగా అరవల మీద ప్రచారం చేసిన చరిత్ర ఉన్న సీమాంధ్రులు ఇవ్వాళ కడుపుమండిన తెలంగాణ వారు ఎప్పుడైనా విమర్శిస్తే బాధపడటం వింతగా అనిపిస్తది మాకు.

తెలంగాణ ఉద్యమ నాయకత్వం చాలా స్పష్టంగా “పొట్టగొట్టినోల్ల మీదనే పోరాటం కానీ పొట్టచేతపట్టుకొని వచ్చినోళ్ల మీద కాదని” చెప్పారు. ఉద్యమ వేడిలో అక్కడో, ఇక్కడో ఎవరో కటువుగా మాట్లాడి ఉండవచ్చు. కానీ గత దశాబ్దపు ఉద్యమ స్వభావం చూస్తే మాత్రం సామాన్య సీమాంధ్రులపై తెలంగాణ ప్రజలు పెద్దగా ఆగ్రహం చూపించిన సంఘటనలు లేవు. 1969తో పోలిస్తే ఇప్పుడు ఉద్యమం చాలా పరిణతి చెందింది. “వలస పాలకులపైనే కానీ వలస వచ్చిన బక్క జీవుల కాదు మా పోరాటం” అని విస్పష్టంగా ప్రకటిస్తున్నది తెలంగాణ ప్రజా ఉద్యమం.

ఆంధ్ర-మదరాసు విభజన జరిగిన తరువాత సభల్లో వక్తలు కూడా అనేవారు. “మొన్నటివరకూ ఎంతో తిట్టుకున్నాం, కానీ ఇప్పుడు సోదరుల్లా కలిసి మెలిసి ఉన్నాం” అని. రేపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఇప్పటి ఉద్రిక్త వాతావరణం సమసిపోతుంది. మనం మనుషుల్లా కలిసే ఉంటాం. ఈ అనిశ్చితి తొలగి మనం అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే  సీమాంధ్ర సోదరులు తమసాటి ప్రజల పోరాటానికి మద్ధతుగా నిలవాలె.

[With inputs from Rakesh Marupaka & Capt. L Panduranga Reddy garu]


Connect with us

Videos

MORE

Telugu

MORE

Featured

MORE