తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో సీమాంధ్ర రిటైర్డ్ అధికారులు తిష్ట వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు సింగరేణిలో రిటైర్డ్ అయిన సీమాంధ్ర అధికారులకు లక్షల రూపాయల భారీ వేతనాలు, అలవెన్సులు, ఫోన్ బిల్లులు, కన్వేయన్స్, ఇతర సౌకర్యాలు కల్పించి నియామకాలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా పోస్టులు కట్టబెట్టడాన్ని టీబీజీకేఎస్ మండిపడుతుంది.
సింగరేణిలో ఇలాంటి నియామకాలు చేయాలంటే పత్రికాప్రకటన చేసి దరఖాస్తులు తీసుకోవాల్సి ఉంటుంది. గతంలో ఉన్న ప్రభుత్వం, కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ కూడా ఈ విధమైన నియామకాలను నిషేధించింది. అయినాకూడా నిబంధనలకు వ్యతిరేకంగా నియామకాలు జరుగుతూనే ఉన్నాయి. సీమాంధ్రులకు పోస్టులు కేటాయించడంపై టీబీజీకేఎస్, సింగరేణి జేఏసీలు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ఇంధన శాఖ కార్యదర్శికి ఫిర్యాదు చేశాయి.