By: సిరి
దున్న ఈనిందంటే దూడను కట్టేయమనే జాతీయ మీడియా హూంకారాలు.. ఘీంకారాల సంగతి కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు కానీ.. ఇవాళ తెలంగాణలో లేడిని చంపిన పులి ఒకటి మూతికి అంటిన నెత్తురు కూడా తుడుచుకోకుండా నీతి శతకాలు వల్లిస్తున్నది. తన కథనాలు, చర్చలు, వ్యాఖ్యానాలతో వందలమంది అమాయక యువకులను మనోవైకల్యానికి గురిచేసి బలిదానాలకు కారణమైన మహమ్మారి సాక్షాలెక్కడని అడుగుతున్నది. పక్కరాష్ట్రాలు పన్నులు కడితే తిని తిరిగే సోంబేరులని రాయించి తెలంగాణ ప్రజలను ఈసడించిన దురంహంకారి అమ్మతోడు తెలంగాణను నేనెప్పుడూ కించపరచలేదని ఒట్ల దండకం చదువుతున్నాడు.
జెండా మోతగాళ్లు : టీఉద్యోగులు
మానవత్వం లేనోళ్లు : టీ డాక్టర్లు
మాఫియాగాళ్లు : టీ ఎంఎస్‌వోలు
ఇంగ్లీషురానోళ్లు : టీ ఉపాధ్యాయులు
బాడుగనేతలు : దళిత, బలహీన వర్గాల నాయకులు
నియంత, పౌండ్రక వాసుదేవుడు : టీ ఉద్యమ సారథి
చెత్తకుప్పల విశ్వనగరం : హైదరాబాద్
అమ్మతోడు నేను అవమానించలేదంటూ బొంకులు!
రాధాకృష్ణ వాదనలో నిజమెంత?
రంగుడబ్బా, పత్రికలో కక్కిన విషమెంత?
తెలంగాణలో అమరుల మరణాలకు ఆత్మ బలిదానం అనే పదాన్ని వాడరాదంటూ నిషేధించిన ఓ మీడియా యజమాని తానే తెలంగాణ ఉద్యమాన్ని సృష్టించినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అప్పుల్లో ఉన్న రాష్ట్రాధినేత అరచేతి వైకుంఠం చూపుతుంటే విజనరీ అంటూ పక్కతాళం వేసిన కలం వీరుడు, తెలంగాణలో మొదటి తరగతికి ఇంగ్లీష్ మీడియం స్కూళ్లు పెడతామంటే ఉపాధ్యాయులెక్కడున్నారు? నేల విడిచిన సాము అంటూ ఎగతాళి చేస్తున్నాడు. తెలంగాణను కించపరిచి బహిష్కరణకు గురైన రెండు టీవీ ఛానెళ్లు స్టేజ్ షోలను తలపించే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తెలంగాణను అవమానించే హక్కు ఉండి తీరాలని డిమాండ్ చేస్తూ వీధినాటకాలు ఆడుతున్నాయి.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఓ అడుగు ముందుకేసి తాను ఎప్పుడూ తెలంగాణను కించపరచలేదని వాదిస్తున్నది. తన తప్పు ఏమీ లేకున్నా, కావాలనే కక్ష కట్టి తమ ఛానల్‌ను బహిష్కరించారని ప్రకటించుకున్నది. టీవీ-9 చేసిన ప్రసారాల గురించి పదే పదే వల్లె వేస్తున్నారు కానీ, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి చేసిన తప్పేంటో ఒక్కమాట కూడా చెప్పలేకపోతున్నారు అని కూడా తన అతి తెలివిని ప్రకటించుకున్నది. నిజంగా ఆంధ్రజ్యోతి ఏ తప్పూ చేయలేదేమో అనే అనుమానం సామాన్యుల్లో కలిగించే ప్రయత్నం కూడా జరుగుతోంది. కానీ ఒకటి కాదు రెండు కాదు వందలసార్లు తెలంగాణకు వ్యతిరేకంగా పనిగట్టుకుని అటు పత్రిక ఇటు టీవీల్లో ఏకకాలంలో దాడులు కొనసాగించింది. జోడుగుర్రాల్లో పత్రిక, టీవీలు చిమ్మిన విషం అంత ఇంత కాదు. ఉద్యమ కాలమంతా దాన్ని దెబ్బతీయడానికి వార్తా కథనాలు వెల్లువెత్తించిన ఏబీఎన్ చివరికి రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా వైఖరి మార్చుకోలేదు.
ఆ…. ఏముంది. రాష్ట్రం వచ్చినా ఏం మారదు. మీరేం బాగుపడరు అంటూ విషం కక్కని రోజు లేదు. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజిని దెబ్బతీసే విధంగా, తెలంగాణలో పరిశ్రమలు రాకుండా పెట్టుబడిదారులను భయపట్టే విధంగా, తెలంగాణలో నక్సలైట్ల సమస్య వల్ల పరిశ్రమలు నడవవంటూ దుష్ప్రచారాలకు తెర తీసే విధంగా, తెలంగాణ ప్రజలకు మానవత్వం లేదనే విధంగా, ఇక్కడి ఉద్యోగులంతా ఓ పార్టీకి ఏజెంట్లు అని ప్రకటించే విధంగా, మెట్రో రైలు లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోవాలని కోరుకునే విధంగా, హైదరాబాద్ లో సీమాంధ్రుల అక్రమాలు, ఆక్రమణలకు కొమ్ముకాసే విధంగా, హైదరాబాద్‌ను గవర్నరే పాలించాలనే విధంగా… రాసిన వార్తలు, చిమ్మిన విషం తెలంగాణ ప్రజలకు తెలిసిందే.
జూన్ 8న చంద్రబాబు సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 11న ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వచ్చింది. చలో ఆంధ్రప్రదేశ్- హైదరాబాద్ నుంచి రిజిష్టర్ కార్యాలయాల తరలింపు ఇప్పటికే 800 కంపెనీలు శీర్షికన వచ్చిన ఈ వార్తలో పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల దృష్ట్యా పెద్ద సంఖ్యలో కొత్త కంపెనీలు నమోదయ్యే అవకాశాలున్నాయి అని రాసుకున్నారు. చంద్రబాబు వచ్చిన రెండు రోజుల్లోనే రాధాకృష్ణకు అద్భుతం కనిపించింది.
టీ డాక్టర్లకు మానవత్వం లేదట…
తెలంగాణ ప్రజలకు, ఇక్కడి వైద్యులకు మానవత్వమే లేదన్నట్లు కూడా ఆంధ్రజ్యోతి వార్తలు వేసి నీచమైన ప్రచారం చేసింది. ఆగస్టు 3న ఆంధ్రా నుంచా.. అయితే వెనక్కే-ఆంధ్ర రోగులను తిప్పిపంపుతున్న ఉస్మానియా, నిమ్స్- చికిత్స నిరాకరణ శీర్షికన వచ్చిన వార్త తెలంగాణపై పూర్తి స్థాయిలో విషం చిమ్మింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే రోగులను తెలంగాణలోని ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రుల్లో చేర్చుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్ నుంచి పంపించే నిరుపేద రోగులకు చికిత్స చేయడానికి ఆసుపత్రుల్లో నిరాకరిస్తున్నారు అని సారాంశం. అదే వార్తలో ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జైళ్లలో ఉన్న ఖైదీలకు రోగమొస్తే చావే శరణ్యమా? అంటూ కన్నీరు కార్చారు. వాస్తవానికి ఇలాంటి సంఘటన ఒక్కటి కూడా జరగలేదు. కానీ తెలంగాణ వారు మాత్రం ఆయనకు మానవత్వం లేని వారుగా కనిపించారు.
తెలంగాణ వారు సోమరిపోతులట…
ఆంధ్రజ్యోతిలో 1956 నష్టాలు అని వచ్చిన వ్యాసంలో తెలంగాణపై కావాల్సినంత ద్వేషం చిందించారు. మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పన్నులు కడితే, ఆ సొమ్ము తినుకుంటూ తెలంగాణ ప్రజలు సోమరిపోతుల్లా తిరుగుతున్నారు అని రాశారు. ఇంకా తెలంగాణలో ఎవరూ పెట్టుబడులు పెట్టకూడదన్నారు. ప్రజాస్వామ్య వాదులు ఈ విషయాన్ని దేశానికి తెలియచెప్పాలట. ఆ వ్యాసంలో తెలంగాణకు వ్యతిరేకంగా చాలా మాటలన్నారు. ఒక ప్రాంత ప్రజలను సోమరిపోతులుగా చిత్రించడాన్ని ఏమని పిలవాలి?
ఉద్యోగులు టీఆర్‌ఎస్ కార్యకర్తలట…
సీమాంధ్రులకు తొలి నుంచి టీ ఉద్యోగులంటే మంటే. అదే డీఎన్ఏ రాధాకృష్ణలోనూ బుస కొట్టింది. తన కొత్తపలుకులో ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్ సభ్యత్వం తీసుకోవడం మినహాయిస్తే ఉద్యోగులంతా టీఆర్‌ఎస్‌లోనే ఉన్నారు అని రాధాక్రిష్ణ నీచమైన వ్యాఖ్య చేశారు. ఇంక్రిమెంట్ ఇవ్వడంతో వారు టీఆర్‌ఎస్ పక్షంగా మారారని కూడా రాశారు. మరి ఆంధ్రలో అశోక్ బాబు గ్యాంగ్ చంద్రబాబుకు సహకరిస్తోంది. వారిని సభ్యత్వం లేని టీడీపీ కార్యకర్తలు అని ఎందుకు రాయరు? వాస్తవానికి ఉద్యోగులు ప్రజల్లో భాగమే. ప్రజలంతా ఉద్యమించినపుడు వారిలో ఒకరిగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యమాన్ని టీఆర్‌ఎస్ ముందుండి నడిపింది కాబట్టి సహజంగా కలిసి నడిచారు. కానీ జమాఖర్చులు తప్ప మానవ ఉద్వేగాల అవగాహన లేని ఆంధ్రజ్యోతికి వాళ్లు కార్యకర్తలుగా కనిపించారు.
స్థానికతలో ఎవరిపక్షం?
1956కు ముందున్న వారే తెలంగాణ వారు అని ఫాస్ట్ పథకానికి స్థానికత తేల్చే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. ఇది ప్రజావ్యతిరేక నిర్ణయంగా రాధాక్రిష్ణ ప్రకటించారు. కోర్టులో ఇది చెల్లదని కూడా న్యాయమూర్తులకన్నా ముందే ప్రకటించారు. తెలంగాణ పిల్లల కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. దీనివల్ల ఆంధ్ర పిల్లలకు మేలు జరగకపోతే, వాళ్ల బాగోగులు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటుంది. మధ్యలో ఆంధ్రజ్యోతి పత్రికకు ఎందుకు బాధ? తెలంగాణ ప్రజలు పన్నులు కడితే ఆ సొమ్ము ఆంధ్రా పిల్లల ఫీజులకు ఇవ్వాలా? ఇది తెలంగాణకు అనుకూలమా? వ్యతిరేకమా? హైదరాబాద్‌లో గవర్నర్ పాలన కోరుకుంటారా?
తెలంగాణ పౌరులెవరూ హైదరాబాద్‌లో గవర్నర్ పాలన కావాలని కోరుకోరు. ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. కానీ ఆంధ్రజ్యోతి మాత్రం గవర్నర్ పాలనను మనసారా కోరుకుంది. స్వయంగా రాధాక్రిష్ణ దీనిపై వ్యాసం రాశారు. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ, భద్రత కావాలంటే శాంతిభద్రతల పర్యవేక్షణ గవర్నర్ చేతిలో ఉండాలని స్వయంగా వెల్లడించారు. ఇది తెలంగాణ వ్యతిరేక వైఖరి కాదా? తెలంగాణకు వ్యతిరేకంగా విషం చిమ్మడంకాదా? సమగ్ర కుటుంబ సర్వేపై కూడా అనేక వ్యతిరేక వార్తలు రాసింది. ఈ సర్వేకు కూడా అపార్థాలు అంటగట్టింది. ఏ ప్రాంతానికి చెందిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకోవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ పుట్టానని చెప్పే రాధాకృష్ణకు ఎందుకు అభ్యంతరం? తెలంగాణ నెత్తురు ప్రవహించే వాడెవడూ ఈ రాతలను సహిస్తాడా?
మెట్రోరైలు ఆగిపోయిందట…
జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఆ మర్నాడే తెలంగాణ రాష్ట్రం మీద విషం కక్కింది ఆంధ్రజ్యోతి. జూన్ 4న తాటికాయంత అక్షరాలతో హెడ్డింగ్ పెట్టి మెట్రో లెక్కలు తప్పుతున్నాయా?- ప్రాజెక్టుపై విభజన ఫీవర్ అనే వార్తను వండింది. అయిపోయింది.. ఇక హైదరాబాద్‌లో ఇక మెట్రో రైలు ప్రాజెక్టు ముందుకు సాగదు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ప్రజలు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు ఇది ఈ కథనం సారాంశం. అలాగే మెట్రో వర్గాల్లో అనుమానాలు రేకెత్తించాలనే చావు తెలివి. అంతటితో కూడా ఆగలేదు. మెట్రో ఎర్రజెండా… డైలమాలో ఎల్‌అండ్ టీ అనే వార్తను తిరిగి ఆగస్టు 30 ప్రచురించింది. అప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండు నెలలయింది. ఆంధ్రజ్యోతి ఆశించినట్లు ఈ రెండు నెలల కాలంలో ఒక్క గంట కూడా మెట్రో పనులు ఆగలేదు. దీన్ని జీర్ణించుకోలేక మెట్రో రైలు ప్రాజెక్టు వివాదంలో పడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయోచ్…అంటూ మరో వార్తను వండివార్చింది.
నక్సలైట్ల పేరుతో పారిశ్రామిక వేత్తలకు బెదిరింపు…
రాష్ట్రం ఏర్పడగానే ఆంధ్రజ్యోతి అత్యంత నీచంగా తెలంగాణలో నక్సలైట్ల సమస్య ఉంది, అది పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిబంధకం అనే భయాన్ని పారిశ్రామిక వేత్తల్లో కల్పించడానికి విశ్వప్రయత్నం చేసింది. మార్కెటింగ్ సమస్యతో వరంగల్ జిల్లాలోని రేయాన్స్ ఫ్యాక్టరీ బంద్ అయితే దానికి రాష్ట్ర విభజనకు, నక్సలైట్ల సమస్యకు ముడిపెట్టి వంట వండారు. రేయాన్స్ ఫ్యాక్టరీ బంద్ శీర్షికతో జూన్ 18న ఈ వార్త ప్రచురించారు. నిజానికి ఈ వార్త రాయడానికి మూడు నెలల ముందు నుంచే రేయాన్స్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఆగిపోయింది. తెలంగాణలో నక్సలైట్ల సమస్య ఉందని సీమాంధ్ర నాయకులు ఉద్యమ సమయంలో చేసిన ప్రచారానికి, ఆంధ్రజ్యోతి కథనానికి తేడా ఏమైనా ఉందా?
కంపెనీలు తెలంగాణను వీడుతున్నాయట…
జూన్ 8న చంద్రబాబు సీఎంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడింది. జూన్ 11న ఆంధ్రజ్యోతిలో ఓ వార్త వచ్చింది. చలో ఆంధ్రప్రదేశ్- హైదరాబాద్ నుంచి రిజిష్టర్ కార్యాలయాల తరలింపు ఇప్పటికే 800 కంపెనీలు శీర్షికన వచ్చిన ఈ వార్తలో పన్ను రాయితీలు, ప్రోత్సాహకాల దృష్ట్యా పెద్ద సంఖ్యలో కొత్త కంపెనీలు నమోదయ్యే అవకాశాలున్నాయి అని రాసుకున్నారు. చంద్రబాబు వచ్చిన రెండు రోజుల్లోనే రాధాకృష్ణకు అద్భుతం కనిపించింది. అంతేకాదు, అదే వార్తలో ఇంకా వందల కంపెనీలు హైదరాబాద్ వీడి, ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాయని, అక్కడి ప్రభుత్వ విధానాలు బాగున్నాయని, అది తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుందని కూడా వార్త రాశారు. అవసరమైతే ట్రాన్స్‌పోర్టు నేను చూసుకుంటా అనడం ఒక్కటి తప్ప అంతా రాశాడు.
తెలంగాణ ప్రభుత్వం పన్నులు వసూలు చేయవద్దట…
ఆంధ్ర ప్రజలపై, ఆంధ్ర ప్రభుత్వంపై ఆంధ్రజ్యోతికి ఎంత ప్రేమంటే.. తెలంగాణ ప్రభుత్వం వసూలు చేసే సెంట్రల్ సేల్స్‌ట్యాక్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎంతో నష్టం అని ఆంధ్రజ్యోతి తెగ బాధ పడింది. మన రాష్ట్రంలోకి వేరే రాష్ట్రం నుంచి వచ్చే వస్తువులపై పన్నులు వసూలు చేయడం మన హక్కు అని, అది మనకు ఉపయోగం అని మాత్రం అంగీకరించలేదు. అందుకే ఏపీ నుంచా… వేసెయ్ పన్ను అనే శీర్షికతో జూన్ 13న వార్త రాసి తెలంగాణను విలన్‌గా చిత్రించింది. ఏఏ విషయాల్లో తెలంగాణను ఇరుకున పెట్టవచ్చో, ఎక్కడ తెలంగాణకు అన్యాయం చేయవచ్చో కూడా ఆంధ్రజ్యోతి పత్రిక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక పాఠాలు కూడా చెప్పింది. ఆంధ్రా టు హైదరాబాద్ ఇసుక రవాణా బంద్- అంతర్రాష్ట్ర నిబంధనలు అడ్డు అనే వార్తను జూన్ 13న ప్రచురిచింది. ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ర్టానికి ఇసుక తరలించడానికి నిబంధనలు ఒప్పకోవనే విషయం పట్టిపట్టి గుర్తు చేసింది. దీనివల్ల తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ లో నిర్మాణరంగానికి ఎంతో నష్టమని తెలిసి వార్త రాసి పైశాచిక ఆనందం పొందింది.
పరిశ్రమలకు ఆంధ్రప్రదేశే అనుకూలమట…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి పరిశ్రమలను వీలయినంతగా ఆంధ్రప్రదేశ్ వైపు తరమడానికి రాయని వార్త లేదు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు రాయితీలిచ్చే పరిస్థితిలేదని తానే తేల్చి చెప్పింది. జూలై 3న తెలంగాణ మెడకు రాయితీల గుదిబండ అనే శీర్షికన వార్త ఇందులో భాగమే. పాత బకాయిలు తీర్చడంతో పాటు కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చే సంస్థలకు అవసరమైన నిధులు కేటాయించడం కొత్త ప్రభుత్వానికి సవాల్‌గా మారే అవకాశం ఉందని… ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా దక్కనున్నందున అక్కడి ప్రభుత్వానికి ఆ సమస్య లేదు అని ఆంధ్రజ్యోతి తేల్చేసింది. దీనర్థం ఏమిటి?
ఆక్రమణల తొలగింపుపై శోకాలు…
తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించింది. అదేదో పెద్ద నేరమైనట్లు ఆంధ్ర జ్యోతి వరుస కథనాలు ప్రచురించి హుస్సేన్ సాగర్ నిండిపోయేంత కన్నీరు కార్చింది. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాల తొలగింపు అసంభవం అని కూడా తానే తీర్పు చెప్పింది. వార్తల్లోనే కాదు రాధాకృష్ణ స్వయంగా తన కొత్తపలుకులో హైదరాబాద్‌లో ఏది అక్రమ నిర్మాణమో? ఏది సక్రమ నిర్మాణమో? చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? అంటూ మేధస్సు ఒలికించారు. సీమాంధ్రులనే టార్గెట్ గా చేసుకుని ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం ప్రారంభించారనే భావన ఉంది అని రాధాకృష్ణ సూత్రీకరించి.. సీమాంధ్రుల ప్రయోజనాలు కాపాడడం అనే బాధ్యతను భుజానికిఎత్తుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓ పత్రిక అక్రమ నిర్మాణాల జోలికి పోవద్దంటూ కథనాలు రాయడం ఎక్కడన్నా ఉంటుందా?
సింగరేణి టేకోవర్ సాధ్యం కాదట…
కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆస్తిగా ఉన్న సింగరేణిని మొత్తంగా సొంతం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అదొక ఆశయం. బాగుపడాలన్న తపన. బంగారు భవిష్యత్తు ఏర్పరుచుకోవాలన్న కోరిక. దానిపై రాధాకృష్ణకు ఎందుకు కంటగింపు? ఆంధ్రజ్యోతికి వచ్చిన బాధ ఏంటి? సింగరేణి టేకోవర్ సాధ్యమేనా అని జూలై 24న వార్త ప్రచురించింది. తెలంగాణ మేలు కోరేవాడు ఎవరైనా ఇలా చేస్తారా? రాస్తారా? మీడియా స్వేచ్ఛ ఇప్పుడు గుర్తొచ్చిందా?
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ ఇప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీసినందుకు, తెలంగాణ రాష్ర్టానికి వ్యతిరేకంగా పనిచేసినందుకు ఎంఎస్‌ఓలు రెండు చానళ్లను అనేకసార్లు బంద్ చేశారు. ఉద్యమ సమయంలో కూడా తెలంగాణ వ్యతిరేక వార్తలు ప్రసారం చేస్తున్నారని టీవీ 9, ఏబీఎన్, ఎన్టీవీ ప్రసారాలను ఇదే కేబుల్ ఆపరేటర్లు బంద్ చేశారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు. పైగా అది టీజాక్ పిలుపుతో జరిగింది.
నెలరోజులకు పైగా బంద్ పెట్టినంక మీడియా యాజమాన్యాలు ఇకపై తెలంగాణ వ్యతిరేక వార్తలు రాకుండా చూస్తాం అని కేబుల్ ఆపరేటర్లకు హామీ ఇచ్చారు. తర్వాత మళ్లీ ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మళ్లీ కేబుల్ ఆపరేటర్లు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ టీ న్యూస్, వీ6, టీఎన్‌ఎన్ లాంటి చానళ్లను ఆంధ్రలో పెట్టడం లేదు. నమస్తే తెలంగాణ పేపర్‌ను ఆంధ్రప్రదేశ్‌లో బహిష్కరించారు. పత్రికలను కాలబెట్టారు. బయో డైవర్సిటీ సదస్సుకు తెలంగాణ మీడియా ప్రతినిధులను రానివ్వలేదు. నిన్నగాక మొన్న ఏపీ అసెంబ్లీకి నమస్తే తెలంగాణ విలేకరులను రానీయలేదు. నమస్తే తెలంగాణ పత్రికను, టీ న్యూస్‌ను, సాక్షి మీడియాను కూడా తెలుగుదేశం పార్టీ బహిష్క రించింది. అప్పుడు మీడియా స్వేచ్ఛ గురించి గుర్తుకు రాలేదు. తెలంగాణ గడ్డమీద వ్యాపారం చేసుకుంటూ, తెలంగాణ ప్రజలను అవమానించడమే మీడియా స్వేచ్ఛయా? తెలంగాణ ప్రజలను అవమానించడానికి స్వేచ్ఛ కోరుతున్నారా? 2009 సంవత్సరంలో రాధాకృష్ణ తన పత్రికలో స్వీయచరిత్ర రాసుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో రేషన్ షాపులో తక్కువ రేటుకు వచ్చిన బియ్యాన్ని, కిరోసిన్‌ను పక్క రాష్ట్రమైన మహారాష్ట్రకు తీసు కుపోయి అమ్ముకున్నాను అని అందులో పేర్కొన్నారు. తిన్నింటి వాసాలు లెక్కబెట్టే అదే బుద్ధి ఇంకా కొనసాగున్నట్లు కనిపిస్తున్నది. అందుకే తెలంగాణలో ఉంటూ, పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ కు మన ప్రయోజనాలను అమ్ముకుంటున్నట్లు కనబడుతున్నది.
నమస్తే తెలంగాణ సౌజన్యంతో..