హుదూద్ తుఫాన్ ప్రభావంతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే సహాయకచర్యలు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుండి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుండి హైదరాబాద్ తిరిగివచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
తుఫాన్ ప్రభావంపై ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఆర్డీవోలు, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అంతేకాకుండా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకుంటున్న సహాయకచర్యలను కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఫోన్ లో వివరించారు. సీఎం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో పాటు సీఎంవో కార్యాలయ అధికారులు పాల్గొన్నారు.