mt_logo

ఆంధ్రా ఉద్యోగుల భారం కూడా తెలంగాణపైనా? – కేసీఆర్

ఉద్యోగుల విభజనలో సీమాంధ్ర అధికారులు అడుగడుగునా అక్రమాలకు పాల్పడుతూ సీమాంధ్రకు అక్కడా, ఇక్కడా మేలుచేసేవిధంగా ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో భారీగా ఉన్న సీమాంధ్రులకు రక్షణ కల్పించే ఉద్దేశంతోనే తెలంగాణ ఉద్యోగులకు సీమాంధ్రలో పోస్టింగులు వేస్తున్నారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యోగసంఘాల జేఏసీ చైర్మన్ సీ. విఠల్ ను సీమాంధ్రకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడమే ఇందుకు నిదర్శనం. సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణలో పనిచేయనివ్వకుంటే, సీమాంధ్రలో విధులు నిర్వహిస్తున్న తెలంగాణ వాదులనూ పనిచేయనివ్వమని చెప్పేందుకే విఠల్ లాంటి నేతలను సీమాంధ్రకు కేటాయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విభజన ప్రక్రియలో సీమాంధ్రకు చెందిన ఉన్నతాధికారులే ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఉద్యోగుల జీతభత్యాల భారం పడకుండా ఉండేందుకు కుట్రలు చేస్తున్నారని, ఆయా శాఖలలో మంజూరు అయిన పోస్టులను పరిగణనలోకి తీసుకుని విభజన జరపాల్సి ఉండగా, ప్రస్తుతం ఉన్న ఉద్యోగుల సంఖ్యను ఆధారంగా చేసుకుని విభజన ఏర్పాట్లు చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగసంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రాంతంలో 58 వేలమంది సీమాంధ్రులు పనిచేస్తున్నారని జయభారత్ రెడ్డి కమిషన్ 1985లోనే చెప్పింది. ఈ కమిషన్ నివేదిక చెప్పినట్లు అక్రమంగా నియమించబడ్డ సీమాంధ్ర ఉద్యోగులను వారి స్వస్థలాలకు పంపాలని 610 జీవో జారీ అయింది. 2001లో గిర్ గ్లాని కమిషన్ కూడా లక్షన్నర నుండి రెండున్నర లక్షలమంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ ప్రాంతంలో పనిచేస్తున్నట్లు తేల్చిచెప్పింది. ఈ రెండు కమిషన్లు ఇచ్చిన నివేదికలను సీమాంధ్రకు చెందిన పాలకులు తొక్కిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *