పీపీఏ రద్దుచేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరడం హాస్యాస్పదమని, పీపీఏల ఆధారంగానే ఇప్పటివరకు టారిఫ్ లను నిర్ణయించారని, విద్యుత్ లోటు ఉన్న విషయం తెలిసికూడా నిర్ణయం తీసుకోవడం ఏమిటని భారీ నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీష్ రావు ప్రశ్నించారు. పీపీఏలు రద్దయితే తెలంగాణ 460 మెగావాట్ల విద్యుత్ కోల్పోతుందని, ఆంధ్రప్రదేశ్ నిర్ణయం అమలవ్వకుండా చూస్తామని ఆయన అన్నారు. ఒప్పందాలన్నీ కొనసాగేలా చూడాలని పునర్విభజన చట్టంలో ఉందని హరీష్ రావు గుర్తుచేశారు.
మరోవైపు ఇదే విషయమై తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం పీపీఏ రద్దు చేయాలని కోరడం సమంజసం కాదని, ఈఆర్సీ న్యాయబద్ధంగానే వ్యవహరిస్తుందని అనుకుంటున్నామని, తెలంగాణకు కరెంటు తగ్గకుండా తామూ ఈఆర్సీకి వెళ్తామని అన్నారు.