mt_logo

ఆంధ్రా బాబులకు అధికారంపైనే ధ్యాస-దామోదర రాజనర్సింహ

సోమవారం నల్గొండలో జరిగిన తెలంగాణ సీనియర్ మెన్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ చాంపియన్ షిప్ ను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ ప్రారంభించారు. మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం క్లాక్ టవర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన సీఎం కిరంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిల్లును అడ్డుకోవడానికి మా దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని సీఎం అంటున్నారని, వాళ్ళ దగ్గర బ్రహ్మాస్త్రం ఉంటే తెలంగాణ ప్రజల దగ్గర పాశుపతాస్త్రం ఉందని దామోదర అన్నారు. తెలుగు ప్రజలంటే సీమాంధ్ర ప్రజలేనా? తెలంగాణ ప్రజలు కారా? అని ప్రశ్నించారు. ఇన్ని వేలమంది తెలంగాణ బిడ్డలు అమరులైనా సీమాంధ్ర నేతలకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ చరిత్రకు వందల ఏళ్ళ చరిత్ర ఉందని, ఆంధ్రరాష్ట్రానికి మూడేళ్ళే చరిత్ర ఉందని విమర్శించారు. ముల్కీ రూల్స్ చెల్లవని హైకోర్టు తీర్పు ఇస్తే తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే తెలంగాణకు అనుకూలంగా సుప్రీం తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. అసలు విధానమే లేని నినాదం ఎవరికోసమని సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించారు. ఒక ప్రాంతంవారిపై మరోప్రాంత ఆధిపత్యమే తెలుగు ప్రజల ఆత్మగౌరవం అంటే అలాంటి ఆత్మగౌరవం మాకొద్దని ఆయన అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఉద్యమం సాగిందని, ఇన్నిరోజుల ఉద్యమం ఎక్కడా చూడలేదని, అసెంబ్లీలో అన్ని రోజులు చర్చ జరిగినా సీమాంధ్ర ప్రాంత ప్రజల సమస్యలపట్ల ఏఒక్కరూ మాట్లాడలేదని మండిపడ్డారు. ఆంధ్రా బాబులకు ముగ్గురికీ అధికారం పట్ల మాత్రమే ధ్యాస తప్ప ప్రజల పట్ల ఏవిధమైన ప్రేమ లేదని, రాష్ట్ర నాయకత్వం బాగోలేదని, మరో 15రోజుల్లో తెలంగాణ వస్తుందని, అప్పుడే సంబురాలు చేసుకుందామని దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఈ సభలో పాల్గొన్న నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, సీమాంధ్ర నేతలు పట్టపగలు దొంగల్లా తెలంగాణ వనరులను దోచుకున్నారని, నీళ్ళు, నిధులు, నియామకాలు దోపిడీ చేశారని మండిపడ్డారు. మాజీ మంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ గురించి మాట్లాడితే భువనగిరి ఎంపీ, నకిరేకల్ ఎమ్మెల్యేకు అభివృద్ధి నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదవులు తనకు గడ్డిపోచతో సమానమని, అమరుల శవాలపై ప్రమాణాలు చేసిన కొందరు మళ్ళీ సీఎం కిరణ్ ముఖ్యమంత్రి అవుతారన్నారని, అలా అన్న వారిని ఆయన విమర్శించారు. భువనగిరి ఎంపీ కే.రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కిరణ్ అహంభావి, అవివేకి, మూర్ఖుడు అని, కిరణ్ కుమార్ రెడ్డి కాదు కిరికిరి రెడ్డి అని సీఎం పై ధ్వజమెత్తారు. కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకునే రోజు దగ్గరలోనే ఉందని, పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసై తీరుతుందని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *