బుధవారం నాడు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల రౌండ్ టేబుల్ సమావేశంలో టీజేఏసీ చైర్మన్ కోదండరాంతో పాటు టీ ఉద్యోగ సంఘాలు, టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీడీపీ ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రజాఫ్రంట్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ, టీజేఏసీ ప్రతిపాదించిన సవరణలు రాబోయే తెలంగాణ రాష్ట్రానికి వెన్నెముక లాంటివని, భారతరాజ్యాంగ ఔన్నత్యాన్ని తెలిపేందుకు ఉపయోగపడతాయని వివరించారు. సవరణలు చేసిన నోట్ ను ఐదు పేజీలుగా చేసి టీ నేతలకు అందించామని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న సంపూర్ణ తెలంగాణ సాధించడానికి ఈ సవరణలు, సూచనలు చేసామని పేర్కొన్నారు.
మాజీ పీసీసీ చీఫ్ డీ. శ్రీనివాస్ ఉగాది పండుగకల్లా రెండు రాష్ట్రాలు ఏర్పడుతాయని స్పష్టం చేశారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ, పార్లమెంటుకే రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాధికారాలు ఉన్నాయని, తెలంగాణ అడ్డుకునేవారి విషయం డిల్లీలోనే తేల్చుకుందామన్నారు. 119 మంది శాసనసభ్యులంతా ఒకే నినాదంతో ఉన్నారని, అదే తెలంగాణ నినాదమని చెప్పారు.
టీ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ దేవీప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యోగులకు ఎన్నో ఏళ్ళుగా అన్యాయం జరుగుతూ వస్తుందని, టీజేఏసీ ప్రతిపాదించిన బిల్లులోని 13 సవరణలపై చర్చ జరగాలని, అందుకు శాసనసభ వేదిక కావాలని కోరారు. ఇదే విషయాన్ని టీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కూడా వ్యక్తం చేశారు. సమావేశంలో పాల్గొన్న అందరి అభిప్రాయం సంపూర్ణ తెలంగాణ మాత్రమే అని చాటిచెబుతూ జై తెలంగాణ నినాదాలతో సమావేశ ప్రాంగణాన్ని హోరెత్తించారు. చర్చ జరిగే సమయంలో సవరణలున్న ఈ నోట్ చాలా ఉపయోగపడుతుందని ప్రతిఒక్కరూ అభిప్రాయం వ్యక్తం చేశారు.