అమరవీరుల కుటుంబాలను ఆదుకునే క్రమంలో ఒక్కొక్క అమరవీరుడి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందజేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పది జిల్లాల కలెక్టర్ల నుండి వచ్చిన నివేదికల ఆధారంగా 459 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. పది లక్షల చొప్పున మొత్తం రూ. 45.90 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమంలో పలువురు యువకులు ప్రాణత్యాగం చేశారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని సార్వత్రిక ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం కోసం అర్హులైన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఈ ఆర్ధిక సాయం అందజేస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.