తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో నీటిపారుదల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ, టీడీపీ అమరవీరుల కుటుంబాలకు టికెట్ ఇవ్వలేదని, శంకరమ్మకు టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తే టీడీపీ అభ్యర్థిని పోటీకి నిలబెట్టారని గుర్తుచేశారు. అమరవీరులకు రాష్ట్రప్రభుత్వం తరపున నివాళులర్పించామని, సభలో మొట్టమొదట అమరవీరులను తలచుకుని కేసీఆర్ స్పీచ్ మొదలుపెట్టారని, మానిఫెస్టోలో పొందుపరిచిన ప్రతి అంశాన్ని అమలుచేస్తామని చెప్పారు.
అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ అధికారుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదని, కొత్త రాష్ట్రంలో ఇంకా పూర్తి స్థాయి పాలన ప్రారంభం కాలేదని పేర్కొన్నారు. అధికారుల పంపిణీ రాష్ట్రప్రభుత్వ పరిధిలో ఉండదని, సీఎస్, డీజీపీలతో సహా అధికారులు రాష్ట్రంలో 70మంది మాత్రమే ఉన్నారని అన్నారు. తాము ఏం చెప్తున్నామో, ఏం చేస్తున్నామో ఓపికగా చూడాలని, టీడీపీ నేతలు ప్రజలని గందరగోళ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళవద్దని కోరారు. నిర్మాణాత్మక సలహాలు ఇస్తే తాము స్వీకరిస్తామని, అద్భుతమైన తెలంగాణను నిర్మించుకుందామని రాజకీయ పక్షాలకు సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.