mt_logo

పొత్తా? విలీనమా? మరికొద్ది గంటల్లో తేలనుంది..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన టీఆర్ఎస్ పార్టీ రాజకీయ చదరంగంలో ఎత్తుల వ్యూహాలకు మరికొద్దిసేపట్లో పదును పెట్టనుంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో మైలురాళ్ళు దాటుకుని విజయమనే గమ్యానికి చేరుకోవడంలో ఎన్నో అవమానాలు, ఇబ్బందులకు గురయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో పిడికిలి బిగించి ముందుకు సాగిన టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీసుకోబోయే నిర్ణయం పట్ల యావత్ తెలంగాణ ప్రజానీకం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఈ రోజు జరిగే పార్టీ పోలిట్ బ్యూరో, కార్యవర్గ, ఎమ్మెల్యే, ఎంపీల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించనుంది. మరోపక్క తెలంగాణ టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి టీఆర్ఎస్ పార్టీలోకి వలస వస్తుండటం వల్ల తెలంగాణలో టీడీపీ కనుమరుగయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న రంగారెడ్డి జిల్లా టీడీపీ నేతలు చేరగా, ఈ రోజు వరంగల్, ఆదిలాబాద్ జిల్లా నేతలు చేరనున్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం ఇదే కావడం, ఈ సమావేశంలోనే పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండటంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్ తో పొత్తా? విలీనమా? లేక సొంతంగా ఎన్నికల బరిలోకి వెళ్తుందా? అన్న అంశాలు ఈ రోజుతో తేలిపోనున్నాయి. వాస్తవానికి తెలంగాణ ఇస్తే పార్టీని విలీనం చేస్తానని కేసీఆర్ గతంలో చెప్పినా వెంటనే కాంగ్రెస్ దానిని అమలుచేస్తే పరిస్థితి వేరేలా ఉండేది. ఇన్నేళ్ళ తర్వాత అదీ ఎన్నికలు ఎంతో దగ్గరిలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. విలీనంపై ఎటువంటి చర్చలు జరపకపోయినా జరిపామని దిగ్విజయ్ సింగ్ అనడం, టీఆర్ఎస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడం ఆ పార్టీ విధానాలను బహిర్గతం చేసింది. జైరాం రమేష్ వ్యాఖ్యలు కూడా గులాబీ శ్రేణులకు కోపం తెప్పించాయి. ఎట్టిపరిస్థితుల్లో విలీనం వద్దని ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా అన్ని రకాలుగా ఆలోచించి అందరి అభిప్రాయాలకు అనుగుణంగానే ముందుకు వెళ్లాలని పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచన. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అత్యధిక మెజార్టీతో గెలుపొందే అవకాశాలున్న టీఆర్ఎస్ పార్టీ విలీనం అవ్వాల్సిన అవసరంలేదని, 14 ఏళ్ళు కష్టపడి చేసిన ఉద్యమం వృథా అవుతుందని, తెలంగాణ ప్రజల తరపున పోరాడే పార్టీ ఉండదని పార్టీ నేతల వాదన. కాంగ్రెస్, టీఆర్ఎస్ విలీనమైతే ఆంధ్రా పార్టీలైన టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రతిపక్ష పాత్రను పోషిస్తాయని, ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికై కేంద్రంపై ఒత్తిడి తేవాలని టీఆర్ఎస్ సభ్యుల అభిప్రాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *