తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నమస్తే తెలంగాణ ఎడిటర్ అల్లం నారాయణ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించేముందు ఆయన గన్ పార్క్ వద్దనున్న అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. అనంతరం ర్యాలీగా వెళ్లి చాపెల్ రోడ్డులోని ప్రెస్ అకాడమీ కార్యాలయానికి చేరుకొని మధ్యాహ్నం 12గంటలకు ప్రెస్ అకాడమీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమానికి ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ రాములు నాయక్, ప్రొ. ఘంటా చక్రపాణి, జర్నలిస్టు నేతలు, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ టి. సురేందర్ తదితరులు హాజరై అల్లం నారాయణను అభినందించారు. ఈ సందర్భంగా అల్లం నారాయణ మాట్లాడుతూ, నవ తెలంగాణ నిర్మాణంలో తెలంగాణ యాస, భాషలకు సాహితీ గౌరవాన్ని కల్పించేందుకు ప్రెస్ అకాడమీ ద్వారా కృషి చేస్తానని అన్నారు. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి ఈటెల మాట్లాడుతూ, పధ్నాలుగేళ్ళుగా తెలంగాణ పోరాటంలో పాల్గొన్న ఉద్యమకారులకు పదవులిచ్చి సీఎం కేసీఆర్ వారిని గౌరవిస్తున్నారని, అందులో భాగంగానే అల్లం నారాయణను ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించారని అన్నారు. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, జర్నలిస్టులు కోల్పోయిన అస్థిత్వాన్ని తిరిగి నిలబెట్టేందుకు అల్లం నారాయణ కృషి చేస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు.