తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుడు ఆకుల భూమయ్యది మామూలు మరణం కాదని, ప్రభుత్వం, పోలీసులు కలిసి హత్య చేయించాయని విరసం అధ్యక్షుడు వరవరరావు అన్నారు. ప్రభుత్వమే హత్య చేయించినట్లు తమవద్ద స్పష్టమైన సమాచారముందని కూడా చెప్పారు. ఆయన కూతురు సునీత మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ నల్లకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మంగళవారం రాత్రి మరణించిన భూమయ్య మృతదేహానికి బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ ఆస్పత్రి ఫోరెన్సిక్ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఆయన మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 12.30 గంటల ప్రాంతంలో భూమయ్య మృతదేహాన్ని సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్దనున్న అమరవీరుల స్తూపం వద్ద సందర్శనకు ఉంచారు. ఆ ప్రాంతమంతా జై తెలంగాణ నినాదాలతో మారుమోగిపోయింది. పలువురు తెలంగాణవాదులు భారీగా తరలివచ్చారు. మధ్యాహ్నం 2.30గంటల ప్రాంతంలో ఆయన స్వగ్రామమైన కరీంనగర్ జిల్లా కాచాపూర్ కు భూమయ్య భౌతికకాయాన్ని తరలించారు.
గురువారం ఉదయం 10గంటలకు కాచాపూర్ లో అంత్యక్రియలు జరుగుతాయని ఆయన సన్నిహితులు చెప్పారు.
ఆకుల భూమయ్య మృతిపట్ల టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తూ, బుధవారం నాడు ఒక ప్రకటన చేశారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ భూమయ్య మరణం పట్ల సమగ్ర విచారణ జరపాలన్నారు. మృతిపై ప్రజలకున్న అనుమానాలను నివృత్తి చేయాలని కూడా స్పష్టం చేశారు. అల్లం నారాయణ మాట్లాడుతూ, భూమయ్య మృతిపై సందేహాలున్నాయని, ప్రభుత్వమే నివృత్తి చేయాలని డిమాండ్ చేశారు. టీజేఏసీ చైర్మన్ కోదండరాం కూడా పై విధంగానే అనుమానం వ్యక్తం చేశారు. సీమాంధ్రుల కుట్రలో భాగంగానే ఈ హత్య జరిగిందని, న్యాయ విచారణ జరపాల్సిందేనన్నారు.
సందర్శించినవారిలో పలువురు తెలంగాణ ప్రాంత నేతలు, తెలంగాణ ప్రజాఉద్యమకారులు, ప్రజా కవులు, తెలంగాణ ప్రజాఫ్రంట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల తెలంగాణ ప్రజలతో క్లాక్ టవర్ ప్రాంగణం జనమయమైంది. తెలంగాణ ఉద్యమ నేత భూమయ్య లేని లోటు తీర్చలేనిదని, సంపూర్ణ తెలంగాణ సాధనే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పలువురు అభిప్రాయపడ్డారు.