mt_logo

ఎయిర్‌టెల్ ఉచిత వైఫై సేవలను ప్రారంభించిన కేటీఆర్

ప్రైవేట్ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా పబ్లిక్ వై-ఫై సేవలను ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో నగరంలోని 17 ప్రాంతాల్లో పరిమితితో కూడిన ఉచిత ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. శుక్రవారం ఐటీ మంత్రి కేటీఆర్, భారతి ఎయిర్‌టెల్ తెలంగాణ, ఏపీ సర్కిళ్ళ సీఈవో వెంకటేష్ విజయరాఘవన్  ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇది ప్రారంభమేనని, హైదరాబాద్ లోని అన్ని ప్రాంతాలకు వై-ఫై సౌకర్యాన్ని వచ్చే నాలుగు నెలల్లో అందుబాటులోకి తెస్తామని అన్నారు.

దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కొనసాగుతుందని, సైబర్ టవర్స్ సెంట్రల్ పాయింట్ గా మొత్తం 17 వై-ఫై హాట్ స్పాట్ లను ఏర్పాటు చేసినట్లు విజయరాఘవన్ తెలిపారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు రోజుకు 750 మెగాబైట్స్ డాటాను ఉచితంగా పొందేందుకు వీలుంటుందని, పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఈ సేవలు మూడునెలల వరకు అందుబాటులో ఉండనున్నాయని విజయ రాఘవన్ పేర్కొన్నారు. స్మార్ట్ ఫోన్ లు, ఐ ప్యాడ్ లతో పాటు వై-ఫై వసతి ఉన్న ఏ డివైజ్ తోనైనా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చని, ఏ టెలికం ఆపరేటర్ కు చెందిన మొబైల్ నుంచైనా సేవలు పొందొచ్చని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *