వచ్చే ఆదివారం 24 వ తేదీన నిర్వహించనున్న మారథాన్ రేస్ సన్నాహక సమావేశం గురువారం మాదాపూర్ లోని లెమన్ ట్రీ హోటల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఐటీ శాఖామంత్రి కే తారకరామారావు హాజరై మారథాన్ లోగోను, కార్పొరేట్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హ్యాపెనింగ్ హైదరాబాద్ కార్యక్రమంతో నగర ప్రతిష్ఠ మరింత పెరిగే అవకాశముందని, ఏడాదికి 52 వీకెండ్ కార్యక్రమాలను రూపొందించామని తెలిపారు. సంవత్సరానికి 52 కార్యక్రమాలే కాకుండా విభిన్న రకాల కార్యక్రమాలు నిర్వహించే దిశగా చూస్తున్నామని, ఆదివారం జరిగే 5 కే రన్ లో తనతోపాటు తన స్నేహితులు కూడా పాల్గొంటారని కేటీఆర్ చెప్పారు.
ఎయిర్‌టెల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకటేష్ విజయ రాఘవన్ మాట్లాడుతూ, ఎయిర్‌టెల్, హైదరాబాద్ సంయుక్తంగా నిర్వహించనున్న హైదరాబాద్ మారథాన్ రేస్ ఈనెల 24న నిర్వహిస్తున్నామని, ఉదయం 5 గంటలకు ఫుల్ మారథాన్, 6 గంటలకు హాఫ్ మారథాన్ లు నెక్లెస్ రోడ్డు వద్ద ప్రారంభమవుతాయని, 5 కే రన్ గచ్చిబౌలి స్టేడియంలో ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతుందని తెలిపారు. ఈ మారథాన్ లో పాల్గొనదలచిన వారు ఈనెల 23 న హైటెక్స్ లో ఏర్పాటు చేయనున్న ఎక్స్ పోలో ఉదయం 9 నుండి సాయంత్రం 7 గంటల వరకు పేర్లను నమోదుచేసుకోవాలని, ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేవారు www.marathonhyderabad .com వెబ్ సైట్ లో చూడాల్సిందిగా సూచించారు.