శంషాబాద్ ఎయిర్ పోర్టులోని డొమెస్టిక్ టెర్మినల్ కు రాజీవ్ గాంధీ పేరు మార్చి ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ సీఎం కేసీఆర్ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి బీజేపీ, టీడీపీ మినహా మిగతా పార్టీలు ఆమోదం తెలిపాయి. ఎయిర్ పోర్టు పేరు మార్చాల్సివస్తే కొమురం భీం, పీవీ నరసింహారావు పేరు పెట్టాలని బీజేపీ సూచించగా, రాజీవ్, ఎన్టీఆర్ పేర్లను తొలగించి కొత్త పేరును పెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఆంధ్రా నేతల పేర్లను రుద్దడం సరికాదని, తెలంగాణలో పక్క రాష్ట్రం వాళ్ళ పేర్లు ఎందుకని అన్నారు. ఉన్న పేర్లను తీసేయాలని ఇక్కడి ప్రజల డిమాండ్ అని, కొత్తగా ఎన్టీఆర్ పేరును శంషాబాద్ ఎయిర్ పోర్టు డొమెస్టిక్ టెర్మినల్ కు పెట్టడం సరైంది కాదని తప్పుపట్టారు. ఆంధ్రాలో నాలుగు ఎయిర్ పోర్టులున్నాయి.. నాలుగిటికీ ఎన్టీఆర్ పేరునే పెట్టుకోండని సూచించారు. మాకు చరిత్ర లేదా?.. ఒకవేళ పేరు మార్చాల్సి వస్తే తెలంగాణ వారి పేర్లు పెట్టుకుంటాం. పేరు మార్చే విషయంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం సంప్రదిస్తే బాగుండేదని సీఎం పేర్కొన్నారు.